రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా!

వేమన శతకం, సుమతీ శతకం తరహాలోనే భాస్కర శతకం కూడా వుంది. మారవి వెంకయ్య కవి 16వ శతాబ్దంలో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలోని ఒక పద్యం ఇలా చెబుతుంది...

దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్,
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!  

ఈ పద్యం అర్థం ఏమిటంటే, దానం చేయడం చేతగాని ధనికుడికి ఎంత సంపద వుండి ఏం లాభం? అడవిలో బూరుగుచెట్టు విరగ కాస్తుంది. కానీ, దాని కాయలు ఎవరికీ ఉపయోగపడవు. దాని కాయలు పగిలిపోయి దాంట్లో వున్న దూది మొత్తం గాలిలోకి ఎగిరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది.

ఈ పద్యం తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్‌కి వున్న జనాకర్షణ అడవిలో పుట్టిన బూరుగ చెట్టు మాదిరిగా అయిపోయింది. ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడకుండా వృధా అయిపోయింది. అకారణంగా తెలుగుదేశం పార్టీ మీద అలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటున్నారు. పార్టీకి దూరంగా వుండటమే కాకుండా, కొడాలి నాని లాంటి వ్యక్తులకు అండగా నిలిచి, వాళ్ళ నోరు ఎంత మాట అయినా అనడానికి ధైర్యం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు, ఆయన సన్నిహితుల ఉద్దేశం కావచ్చు.. తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలి. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలూ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించే జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు.

2019 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా వున్నారు. ఏ నిమిషంలోనైనా అతని మనసు మారి ప్రచారానికి వస్తారేమోనని తెలుగుదేశం వర్గాలు ఎదురుచూశాయి. తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం అని అనుకుంటూ ఆయన అభిమానులు ఆనందిస్తూ వుంటారు.. అది వేరే విషయం! ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా, చంద్రబాబును విమర్శించడానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ వుంటారు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని ఎవరూ అనుకోరు.

ఈసారి ఎన్నికలలో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం వర్గాలు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తే వున్నాడనే విషయాన్ని మరచిపోయారు. ఆయన ప్రచారం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. గత ఎన్నికలలో రామయ్యా.. వస్తావయ్యా అన్న తెలుగుదేశం.. ఈసారి మాత్రం రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పకుండానే చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా బెట్టు చేసి, బిల్డప్ ఇచ్చే అవకాశం ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. కానీ వైసీపీ మాత్రం జూనియర్ పేరుతో ఫేక్ ప్రచారం చేసుకుంటోంది. జూనియర్ ఫొటో పెట్టుకుని, ఆయన వైసీపీకి మద్దతుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయిన పార్టీకి ఉపయోగపడలేదు. కాని పార్టీ మాత్రం ఇలా ఫేక్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది.