ఇల్లు మారితే పిల్లలు పాడైపోతారా!
posted on Jun 10, 2016 10:46AM
ఉద్యోగ రీత్యా కొంతమంది నిరంతరం బదిలీలు అవుతూ ఉంటారు. తమతో పాటుగా తమ కుటుంబాన్ని కూడా వెంట తీసుకువెళ్తూ ఉంటారు. దీనికి మనం ఏమీ చేయలేం! పైగా సైన్యంలో పనిచేసే అధికారులు ఇలా బదిలీ అయినప్పుడు వారి జీవనశైలిలో పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. వారి పిల్లల చుట్టూ అదే రకమైన చదువు, అదే రకమైన సైనికుల కుటుంబాలూ తారసపడుతూ ఉంటాయి. కానీ ఎలాంటి స్థిరమైన కారణం లేకుండానే కొందరు ఇళ్లను మార్చేస్తూ ఉంటారు. ఒక వాతావరణానికి అలవాటు పడుతున్న పిల్లలను అకస్మాత్తుగా మరో వాతావరణంలోకి నెట్టివేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇంగ్లండులోని మాంఛెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘డాక్టర్ రోజర్ వెబ్’ ఈ విషయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక భారీ పరిశోధనని చేపట్టారు.
తన పరిశోధన కోసం రోజర్ డెన్మార్క్ దేశంలోని గణాంకాల మీద ఆధారపడ్డారు. ఎందుకంటే ఆ దేశంలో పౌరుల కదలికలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది. ఆ గణాంకాల నుంచి రోజర్ 1971-1997 సంవత్సరాల మధ్య పుట్టిన దాదాపు 14 లక్షల మంది వివరాలను సేకరించారు. ఈ 14 లక్షల మందిలో తమకు 15 ఏళ్ల వయసు వచ్చే లోపల ఎవరు ఎన్నిసార్లు ఇల్లు మారారో లెక్కపెట్టారు. అలా తరచూ ఇల్లు మారడానికీ, తరువాత కాలంలో వారి మానసిక సమస్యలు ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం (correlation) ఉందేమో పరిశీలించారు.
రోజర్ పరిశోధన ఆశ్చర్యకరమైన ఫలితాలను వెలువరించింది. 15లోపు మరీ ముఖ్యంగా 12-14 ఏళ్లలోపు వయసువారు తరచూ ఇల్లు మారి ఉంటే కనుక తరువాత కాలంలో వారిలో ఆత్మహత్య యత్నాలు, హింసాత్మక ధోరణులు, మాదకద్రవ్యాలకు అలవాటుపడటం, మానసిక కుంగుబాటు... తదితర ప్రవర్తన కనిపించిందట. బాల్యంలో ఎంత ఎక్కువగా ఇళ్లు మారితే, అంత ఎక్కువగా ఇలాంటి సమస్యలు కనిపించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఫలితాలలో పేద పిల్లలు, గొప్పింటి బిడ్డలు అన్న తారతమ్యం కనిపించకపోవడం.
రోజర్ పరిశోధనని బట్టి నివాస స్థలాన్ని మార్చేయడం అన్నది ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది. ఆ మార్పు పిల్లల్లో, ముఖ్యంగా టీనేజిలో ఉన్న పిల్లల జీవితాలలో బహుశా పెను ప్రభావం చూపించవచ్చు. పెద్దవారిదేముంది? ఆఫీసుల్లోనో, ఇంటి పనుల్లోనో కాలం గడిపేస్తారు! కానీ సమాజంతో అనుబంధాన్నీ, తమదైన దృక్పధాన్నీ అలవర్చుకునే సమయంలో పిల్లల జీవితంలో ఇలాంటి మార్పు వారిలో అభద్రతా భావాన్ని కలిగించవచ్చు, చెడుసావాసాలకీ దారితీయవచ్చు. ప్రతి చిన్న మార్పూ పెను ప్రభావాన్ని చూపే కీలక వయసులో ఇల్లు మారడం అన్నది కూడా ముఖ్యమైన విషయమే అంటున్నారు రోజర్. అందుకనే కొత్తగా నివాసాన్ని మార్చుకున్న పిల్లలను కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
- నిర్జర.