బాంబు పేలింది.. అయినాసరే పోలింగ్ ఆగలేదు...
posted on Nov 25, 2014 2:38PM
తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలింగ్‌కి విఘాతం కలిగిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు జమ్ము కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు తొలివిడత పోలింగ్ జరుగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని అనుకుంటున్న సందర్భంలోనే బందిపూర్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఉగ్రవాదులు బాంబును పేల్చారు. పోలింగ్ కేంద్రం బయట ఈ పేలుడు జరగటం, అది కూడా తక్కువ తీవ్రత కలిగిన బాంబు కావడంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మరిన్ని బాంబులు గానీ ఉన్నాయా అని పరిశీలించాయి. అయితే పోలింగ్ స్టేషన్ బయటే పేలుడు జరిగినప్పటికీ జమ్ము కాశ్మీర్ ప్రజలు ఎంతమాత్రం భయపడకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా వుండగా, జార్ఖండ్‌లోని హుస్సేన్బాగ్ నియోజకవర్గంలో భద్రతాదళాలు ఒక పెద్ద మందుపాతరను స్వాధీనం చేసుకున్నాయి. పాలమావ్ జిల్లాలోని హరిహరగంజ్ ప్రాంతంలో రోడ్డు పక్కన పెట్టిన మందుపాతరను భద్రతాదళాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇదిలా వుండగా జార్ఖండ్‌లోె 61.93 శాతం, జమ్ము కాశ్మీర్‌లో 70 శాతం పోలింగ్ జరిగింది.