జెరుసలేం మత్తయ్య.. చంద్రబాబు, కేసీఆర్ నావల్లే కలిశారు..


 

ఇప్పటికే అవరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ను పిలవడం.. కేసీఆర్ కూడా మాట తప్పకుండ రావడం.. కేసీఆర్ ను చంద్రబాబు జాగ్రత్తగా చూసుకోవడం పై పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కలవడం ఒకరకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంతోషానిచ్చినా.. రాజకీయ నేతలు మాత్రం వారి ధోరణిలో ఆలోచిస్తూ వీరిద్దరూ ఎందుకు కలిశారు.. కలిసి ఏం మాట్లాడుకున్నారు లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరూ ఎవరి ఆలోచనలో వాళ్లు ఉండగా జెరుసలేం మత్తయ్య మాత్రం వీరిద్దరు కలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జెరుసలేం మత్తయ్యం ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ తాను తన  క్రైస్తవ సోదరులూ కలిసి ప్రార్థనలు చేసిన కారణంగానే ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత ఏర్పడిందని అన్నారు. తమ ప్రార్ధనల వల్లే సీఎంల ఇద్దరి మద్య కొత్తగా స్నేహం చిగురించిందని అన్నారు. అంతేకాదు తమ ప్రార్ధనల వల్లే రెండు ప్రభుత్వాలు ఓటుకు నోటు కేసు నుండి బయటపడ్డాయని.. కేసీఆర్ - చంద్రబాబు - కేటీఆర్ ముగ్గురూ జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు - క్రైస్తవుల సంక్షేమానికి ఇద్దరు సీఎంలూ కృషి చేయాలని కూడా మత్తయ్య డిమాండ్ చేసాడు.