మనకి కనిపించని కశ్మీర్ ఇదేనా..?

వర్క్... వర్క్... వర్క్... వీటినుండి బయటపడడానికి నేను నా కుటుంబం, వేరే మిత్రుడి కుటుంబంతో కాశ్మీర్ వెళ్లాం. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంట్లో చెబితే, సరే నీ ఇష్టం అన్నారు... కానీ వాళ్లలో ఏదో ఆందోళన. కాశ్మీర్లో ఎప్పుడూ అల్లర్లు జరుగుతూ ఉంటాయి... అవి ఈ మధ్య ఎక్కువయ్యాయి అని... ఈ విషయం వాళ్ళు నేను కాశ్మీర్ వెళ్ళాక చెప్పారు... ఎందుకంటే, ఈ కారణంతో నన్ను ఆపామేమో అన్న ఫీలింగ్ రాకుండా... కానీ నేను అక్కడ పరిస్థితులు టీవీ ల్లో చూపించినట్టుగా ఏం లేవని చెప్పిన తర్వాత కుదుటపడ్డారు. అయినా, ఏదో సందేహం వాళ్ళని ప్రశాంతత లేకుండా చేసింది. రోజు ప్రొద్దున, సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకొంచెం ప్రశాంతత కలిగింది. 

 

కాశ్మీర్ లో దిగగానే ట్రావెల్ వాళ్ళ కారులో హోటల్ కి వెళ్ళాం. దారి పొడుగునా ఎక్కడ చూసినా మిలిటరీ వాళ్ళు కనిపించారు. మా హోటల్ ముందు కూడా ఒక గ్రూప్ పహారా కాస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. అయితే, ఇది మా డ్రైవర్ నుండి గ్రహించింది. కాశ్మీర్ లో ఎప్పుడు కూడా టూరిస్ట్ లకి లోకల్ వాళ్ళు ఏ రకమయిన ఇబ్బందులు కలిగించిన సందర్భం లేదు. ఇది చెబుతూనే కాశ్మీర్ లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పాడు... తాను చిన్నప్పుడు దాదాపు చాల రోజులు బయటకి రాలేదని ఎందుకో మిలిటరీ వాళ్ళని చూస్తేనే తనకి భయం వేసేది అని. ఇక్కడ దాదాపు చాలా మందికి దాదాపు అదే పరిస్థితి అని వివరించాడు. వాస్తవానికి కాశ్మీర్ కి స్వాతంత్య్రం కోసం పోరాడడానికి కారణం కూడా అదే అని చెప్పాడు. నాకు లోపల ఏదో గెలికేస్తూ ఉంది తాను ఆలా చెబుతుంటే, అది నాలో ఉన్న దేశభక్తి తాలూకు భావనలు అయి ఉండొచ్చు. 

 

ఇంతలో, నేను చెప్పులు కొనడానికి ఒక షాప్ కి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి ఏవో చెప్పులు చూపిస్తూ ఉన్నాడు. నేను బాటా చెప్పులు కావాలని అడిగాని, దానికి అతడు చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ మదిలో నుండి వెళ్లడం లేదు. "సర్ ఇక్కడ కాశ్మీర్ వస్తువులు మాత్రమే దొరుకుతాయి. ఇండియా వస్తువులు దొరకవు," అని. ఇంతలో వేరే ఎవరో అక్కడికి వచ్చి "మీరు ఇండియా వస్తువుల గురించి ఇక్కడ అడగకూడదు," అని కాస్త గట్టిగానే చెప్పాడు. ఈ ఆలోచనల మధ్య హోటల్ కి చేరాము. నా బాధ ఎవరితో షేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నంతలో మా హోటల్ ఓనర్ ని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాను. దానికి అతను, "ఇదంతా చదువుకోని, నిరుద్యోగులు చేస్తున్న ప్రచారం. ఎవరో అవకాశవాదులు చెప్పిన వాటికీ ప్రభావితమయి ఇండియా మీద చేస్తున్న ఆరోపణలు. కాశ్మీర్ ఎప్పటికీ ఇండియా లో భాగమే." అని చెప్పి నా మనసు కుదుట పడేలా చేసాడు. 

 

తర్వాత ఒక రోజు పహల్గామ్ కారులో వెళ్తున్నాం. కార్ డ్రైవర్ మీకు మా హీరో బురుహాన్ వాని తెలుసా అని అడిగాడు. మాకు తెలుసు అని చెప్పడంతో అతన్ని అనవసరంగా చంపేశారని కొన్ని నెలలు ఇక్కడ అనిష్చితి వచ్చిందని చెప్పాడు. నాకు మళ్ళీ కోపం. ఒక తీవ్రవాది మీద ఇంత ప్రేమ ఏంటి అని? కానీ, ఈ సారి నాకు ఒక విషయం అర్ధం అయింది. వీళ్ళని ఎవరో బాగా ప్రభావితం చేస్తున్నారని. అలా అని మా డ్రైవర్ చెడ్డోడేం కాదు. తన జీతం ఎంతో ఎంత కష్టంగా బ్రతుకీడుస్తున్నాడో వివరించాడు. ఎందుకో కాసేపు జాలి కలిగింది. 

 

ఏం జరుగుతుందో తెలియదు కానీ మేం వెళ్తున్న దారి పొడుగునా ఆర్మీ వాళ్ళు, వాళ్ళ వాహనాలు దర్శనమిచ్చాయి. దానికి మా డ్రైవర్ సమాధానం: ఇది మేము రోజూ చూసేదే సర్ అని. అమాయకంగా అడిగాడో, తెలివిగా అడిగాడో తెలియదు కానీ, మీ ఇంటి ముందు ఇలా ఎవరయినా పోలీస్ వాళ్ళో, జవానులో ఎప్పుడూ తిరుగుతుంటే మీకు ఎలా ఉంటుంది? స్వాతంత్ర్యం అంటే ఇదేనా అని? అతడికి సమాధానం ఇవ్వక పోయిన నాలో నేను అనుకున్నది ఏంటంటే, ఆర్మీ వాళ్లు అన్ని ప్రయాసల కోర్చి ఇక్కడ గస్తీ కాస్తున్నారంటే ఇక్కడి వాళ్ళ రక్షణ, అల్లరి మూకల అల్లరి అరికట్టడం, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గించడం కోసమే కదా. "ఇది వీళ్ళు ఎప్పటికి అర్ధం చేసుకుంటారో," అని మనసులోనే అనుకున్నా. మొత్తానికి కాశ్మీర్ అందాలన్నీ చూసి, తిరుగు ప్రయాణం అవుతుండగా నాలో ఏదో వెలితి. ఏదో కోల్పోతున్నాం అనే భావన. వాస్తవానికి, నా జీవితంలో ఎన్నో ప్రదేశాలకి వెళ్లినా ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎప్పుడూ నెలకొనలేదు. దేవుడా కాశ్మీర్ లో పరిస్థితులు త్వరగా చక్క బడేలా చూడు అని మాత్రం మొక్కుకున్నా, ఎందుకంటే అక్కడి వాళ్ళు మన సహోదరులే కదా!