రాయి పడింది... ప్లాను చెడింది.. కోడికత్తి-2 కేసు తుస్సుమంది!

అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో కోడికత్తి ద్వారా తన మీద తాను దాడి చేయించుకోవడం ద్వారా జగన్ మావయ్య రాజకీయంగా లాభం పొందారు. ఈసారి ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఆయన ప్రభుత్వం పరువు పాతాళానికి చేరుకోవడంతో ‘కోడికత్తి-2’ డ్రామాకు తెర తీసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఆ కేసును నీరుగార్చే పనిలో పడింది. అలా రాయి తగిలిందో లేదో ఇలా జగన్‌పై హత్యాయత్నం అని భారీ స్థాయిలో మీడియాలో ప్రచారం చేయడంతోపాటు, జగన్‌పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబు నాయుడేనని రకరకాల కథనాలు వండి వడ్డిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు వెనకడుగు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్‌పై రాయిపడిన సంఘటనకి  ‘హత్యాయత్నం’ కలరింగ్ ఇచ్చి, దానికి  చంద్రబాబుని బాధ్యుణ్ణి చేసి రాజకీయంగా మరోసారి లాభం పొందాలని వైసీపీ వర్గాలు శాయశక్తులా కృషి చేశాయి. అయితే జనం ఈసారి జగన్ మాయలకు మోసపోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వాళ్ళ చేసిన ప్రచారం అంతా తేలిపోయింది. జనంలో సానుభూతికోసమే జగన్ ఈ డ్రామా ఆడిస్తున్నాడని జనం అర్థం చేసుకుని లైట్‌గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని క్లారిటీగా చెబుతున్నారు. దాంతో జగన్ పథకం పారలేదు. దీనితోపాటు ఈ సంఘటనతో జగన్ మీద నెగటివిటీ పెరిగింది. ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం వుంది. ఈ నెలరోజులపాటు ‘హత్యాయత్నం, హత్యాయత్నం’ అని గగ్గోలుపెట్టి జనం సానుభూతిని పొందాలని జగన్ అండ్ కో వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి జరిగే ఎన్నికలలో జగన్ పార్టీకి 40 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంచనాలుండేవని, ఈ కోడికత్తి-2 సంఘటన తర్వాత జగన్ మీద జనంలో వ్యతిరేకత మరింత పెరిగి మరో పదిస్థానాలు తగ్గిపోయాయని ఒక వైసీపీ ప్రముఖుడే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ కేసుని కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో వాళ్ళు కేసును తవ్వి నిజానిజాలు బయట పెట్టేముందే తామే హ్యాండ్సప్ అయిపోతే మంచిదని, కేసును  క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పోలీసులు కొత్త కేరెక్టర్లను రంగంలోకి దించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడితోపాటు అతని మిత్రులైన ఆకాష్, చిన్నారావు, దుర్గ, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ మీద రాయి విసిరిందని తానేనని సతీష్ అనే కుర్రాడు ఒప్పుకున్నాడు. ఇంతకీ జగన్ మీద రాయి ఎందుకు వేశావయ్యా అని పోలీసులు అడిగితే, ‘మాకు క్వార్టర్ బాటిల్, 350 రూపాయలు ఇస్తామని వైసీపీ నాయకులు ఆశపెట్టి జగన్ సభకు తీసుకొచ్చారు. తీరా వచ్చాక డబ్బు ఇవ్వకుండా మందు బాటిల్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. డబ్బులివ్వకుండా వెళ్ళిపోయారన్న కోపంతోనే జగన్‌ను రాయితో కొట్టాను’ ఇది జగన్‌పై ‘హత్యాయత్నం’ కేసులో దొరికిపోయిన నవ యువకుడు చెప్పాడు. డబ్బు ఇవ్వకపోవడంతో సదరు యువకుడికి కోపం వచ్చిందట. రోడ్డు పక్కనే వున్న ఒక రాయిని తీసుకుని జగన్ మీదకి విసిరాడట. అదీ విషయం.

నిన్నటి వరకూ అంతమంది జనాల్లో, అది కూడా లైట్లు లేని సమయంలో ఎవరు దాడి చేశారో ఎలా కనుక్కవాలి? అని చెబుతూ వచ్చిన విజయవాడ పోలీసు పెద్దలకు ఇప్పుడు ఈ 350 రూపాయల బ్యాచ్ ఎలా దొరికిందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్‌పై దాడి చేశాడని చెప్పిన యువకుడు, మిగతావాళ్ళ పరిస్థితి మరో కోడికత్తి శ్రీనులా అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిందే. తన కొడుకుని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారని, ఎక్కడ వున్నాడో తెలియదని సతీష్ అనే యువకుడి తల్లి లబోదిబోమంటోంది. మరి పోలీసులు సతీష్ తదితరులను మీడియా ముందు హాజరు పరుస్తారా లేక పోలీసులే ఈ కేసు గురించి, దాడి జరిగిన తీరు గురించి మీడియాకి చెప్పి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి వుంది.