జగన్ రెడ్డికి ఊరికో ప్యాలెస్.. ఎక్కడా స్థిమితంగా, స్థిరంగా ఉండరు!
posted on Oct 16, 2023 7:26AM
సీఎం అంటే ఓ ఇల్లు.. రెండు కార్లు సరిపోవా? పోనీ, ఒక ప్యాలెస్, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తలా ఒక కారు సరిపోదా? నగరానికో ఇల్లు.. డజన్ల కొద్దీ కార్లు కావాలా? రానా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమలో డైలాగ్ దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏపీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే జగన్ ఎక్కడకి వెళ్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టుకుంటున్నారు. నిధులు, నిబంధనల సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు తన ప్యాలెస్ లతోనే హైలెట్ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న ప్యాలెస్ లో నివాసం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కోసం విశాఖ రుషికొండపై వందల కోట్లతో నివాసం(ప్యాలెస్) సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ నివాసంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహప్రవేశం కూడా చేయనున్నారు.
అయితే, సహజంగా సీఎం నివాసం అంటే అధికారం ఉన్నన్ని రోజులే ఉటుంది. ఎందుకంటే అది ప్రభుత్వ భవనం కనుకప. ముఖ్యమంత్రి మాజీ కాగానే అది ఖాళీ చేయాలి. కానీ రుషికొండపై కడుతున్న నివాసాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసమే జీవిత కాలం ఉండేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. పర్యాటక శాఖ పేరిట కడుతున్న ఈ నిర్మాణాన్ని 33 ఏళ్ల పాటు ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకి ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తి సీఎం జగన్ బినామీనే అనీ, అందుకే జగన్ కోసమే ఆ నివాసం నిర్మాణమైందనీ అంటున్నారు. ఇప్పుడు జగన్ వయసు 50 సంవత్సరాలు కాగా మరో 33 ఏళ్ళు అంటే 83 సంవత్సరాల వయసు వరకూ ఆ నివాసం జగన్ కోసమే ఉంటుంది. దీంతో అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని నివాసాలు ఉన్నాయి? ఇప్పటికే ఎన్నో ప్యాలెస్ లు ఉండగా ఇప్పుడు రుషికొండపై ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్యాలెస్ లాంటి నివాస భవనం కూడా తనకే కావాలని జగన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆయన ఎన్ని నివాసాల్లో కాపురం చేస్తారు? అసలు ఆయనకు ఈ నివాసాల ఫాంటసీ ఏంటి అనేది చర్చకు వస్తున్నది.
అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదేం ఫాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటున్నారు. ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు కానీ అందులో ఉండలేరు. అప్పటికప్పుడు అవసరానికి అక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టేసి ఉన్నన్ని రోజులు ఉండేసి వస్తున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో, తాతల కాలం నుండి వచ్చిన పాత ఇంటి స్థానంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. ఇది చూసేందుకు సాధారణంగానే ఉన్నా లోపల 50 కాపురాలు నివాసం ఉండేలా ఉంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ సొంత జిల్లా కడపలో మరో ప్యాలెస్ ఉంది. అప్పట్లోనే దీనిని రాజశేఖరరెడ్డి కళ్ళు చెదిరేలా నిర్మించారు. ఈ కడప నివాసం మొత్తం రాయలసీమకు హైలెట్ గా నిలుస్తుంది. దేశవిదేశాల నుండి తెప్పించిన మెటీరియల్ తో ఇది నిర్మించగా విదేశీ నిపుణులతో ఆర్కిటెక్ట్ చేయించారు. జగన్ కు ఉమ్మడి కడప జిల్లాలోని ఇడుపులపాయలో కూడా ప్యాలస్ లాంటి భవనం ఉంది.
ఇక జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు. అంతే కాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిపాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉండగా.. ఇందులో మూడు షిఫ్టులులో వందల మంది పని వారు ఉంటారని చెప్తారు. సామాన్య మానవునికి ఏ మాత్రం ఎంట్రీ లేని ఈ ప్యాలెస్ విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు, మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక, అది కాకుండా ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలవబడే భవనం కూడా సామాన్యమైంది కాదు. ఇప్పుడు ప్రభుత్వం అంతా అక్కడ నుండే నడుస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు అది ఏ స్థాయిలో ఉందో. దీని విలువ కూడా వందల కోట్ల రూపాయలలోనే ఉంటుందని అంచనా. మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ చెన్నైలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు సుమారు రూ.500 కోట్ల వ్యవయంతో ఆయన కోసం రిషికొండపై ప్యాలెస్ రెడీ అవుతోంది.