నాంపల్లి పోలీసులకు జగన్ వార్నింగ్!
posted on Dec 19, 2015 3:00PM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే రోజాని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు అధికారులతో ఘర్షణ పడ్డారు. తమ మహిళా ఎమ్మెల్యే రోజా పట్ల సరిగ్గా వ్యవహరించకాపోతే కోర్టుకి వెళ్లి అందరి ఉద్యోగాలు ఊడగొట్టిస్తా కబడ్ధార్! అని డ్యూటీలో ఉన్న పోలీసులని బెదిరించారు. ఈ విషయం ఆయనకి చెందిన సాక్షి మీడియాలో కూడా ప్రచురించబడింది. స్పృహ తప్పి ఉన్న రోజాను పోలీసులు తమ వ్యాన్ లోనే నీమ్స్ ఆసుపత్రికి తరలించబోతుంటే జగన్ మళ్ళీ అడ్డుపడ్డారు. ఆమెను అంబులెన్స్ లోనే తరలించాలని పట్టుబట్టారు. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం లేక పోలీసులు అంబులెన్స్ ని రప్పించి అందులో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అధికారంలో లేనప్పుడే జగన్ తీరు ఇలాగ ఉంటే, నిజంగా ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.
ఆయన ఒక ప్రజా ప్రతినిధి కనుక ఆయన ప్రవర్తన నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. నలుగురికి కాకపోయినా కనీసం తన పార్టీలో నేతలకయినా ఆదర్శంగా ఉండాలి. కానీ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఆయనే ఈవిధంగా వ్యవహరిస్తుంటే, ఇక గిడ్డి ఈశ్వరి, రోజా వంటివారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు? అందుకే ఒకరు ముఖ్యమంత్రిపైకి దూసుకువెళితే, మరొకరు ముఖ్యమంత్రినే తలనరుకుతా అని బెదిరించగలిగారనుకోవాలి. నాంపల్లి పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రింద పనిచేయడం లేదు. వారు తెలంగాణా ప్రభుత్వం క్రింద పనిచేస్తుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను పాటించనవసరం లేదు. పైగా డ్యూటీలో ఉన్న తమను ఉద్యోగాలు ఊడగోడతానని బెదిరించినందుకు తిరిగి కేసు కూడాపెట్టవచ్చుననే సంగతి ఆయన గ్రహించినట్లు లేదు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకొంటే అది అంతర్ రాష్ట్ర సమస్య అవుతుంది కూడా. జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ పట్ల గౌరవం లేదు. ముఖ్యమంత్రి పట్ల గౌరవం లేదు. ఇప్పుడు పోలీసులన్నా తనకు చాలా చులకనే అని నిరూపించుకొన్నారు.