జగన్ శల్యసారధ్యంలో వైకాపా పయనం ఎటువైపు?

 

ఇంతవరకు ఏదో సరదాగా సరదాగా సాగుతోందనుకొన్న తెదేపా-వైకాపాల మధ్య యుద్ధం అకస్మాత్తుగా రసవత్తమయిన క్లైమాక్స్ దశకు చేరుకొంది. అందులో ఇప్పుడు అధికార తెదేపాదే పైచేయి సాధించినట్లు కనబడుతోంది. అయితే తెదేపాకు ఆ అవకాశం కల్పించింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డేనని ఒప్పుకోక తప్పదు. ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు అజెండాలో తముకోరుకొన్న అంశాలను చేర్చకపోయినట్లయితే సభలో తాము ‘అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని అధికార తెదేపాను హెచ్చరించడం ద్వారా వైకాపా తెదేపాకు మొదట్లోనే ఒక బ్రహ్మాస్త్రం అందించింది. వీలుచిక్కినప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు దానిని వైకాపా మీద ప్రయోగిస్తూనే ఉన్నారు.

 

ఆ తరువాత తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదంటూ స్పీకర్ కోడెల మీద వైకాపా సభ్యులు విరుచుకుపడటమే కాకుండా సభలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. స్పీకర్ ని దూషించి పెద్ద పొరపాటు చేసిన వైకాపా సభ్యులు ఆ తరువాత ఆయనపై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసిచ్చి మరో తప్పిదం చేసారు. దానిని సభ చర్చకు చెప్పట్టేవరకు సభలో అడుగుపెట్టమని భీకర శపథం చేసి అధికార పార్టీకి మరో ఆయుధం అందజేశారు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బయలుదేరబోతున్నట్లు ప్రకటించి మరో తప్పు చేసారు.

 

శాసనసభ సమావేశాలకు హాజరవడం ఇష్టం లేకనే జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి ఈ విధంగా చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తెదేపా నేతలు విమర్శలు గుప్పించడంతో, చేసిన ప్రతిజ్ఞలను దిగమింగుకొని, బస్సు యాత్రలను రద్దు చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు శాసనసభకు హాజరవవలసి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ సభ్యులు అందరూ వారితో సభలో చెడుగుడు ఆడేసుకొన్నారంటే అతిశయోక్తి కాదు.

 

“జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు సభని ఎందుకు బహిష్కరిస్తారో...మళ్ళీ ఎందుకు తిరిగి వస్తారో...మళ్ళీ ఎందుకు వాక్ అవుట్ చేస్తుంటారో...ఎవరికీ తెలియదు” అంటూ అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తుంటే వారికి జగన్మోహన్ రెడ్డి వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవడం చూస్తుంటే చాలా నవ్వు తెప్పిస్తుంది.

 

అయితే వైకాపా కష్టాలు అంతటితో తీరిపోలేదు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడదామని వైకాపా చూస్తే, స్పీకర్ ని దూషించినందుకు 9 మంది వైకాపా సభ్యులను సభ నుండి (ఆరు నెలలపాటు) సస్పెండ్ చేయాలని కోరుతూ స్పీకర్ కి నోటీసు ఇవ్వడంతో వైకపా కంగుతింది. వైకాపా అప్పుడు ప్రభుత్వంతో కాళ్ళబేరానికి రాక తప్పలేదు. తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయకుండావదిలేస్తే, తాము స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకొంటామని బేరం పెట్టింది. సభలో తమకు మెజార్టీ లేదని, తమ నోటీసుకి మద్దతు ఇచ్చేందుకు సభలో వేరే ఇతర పార్టీలు ఏవీ లేవని తెలిసిఉన్నప్పటికీ అధికార పార్టీని ఏదోవిధంగా అప్రదిష్ట పాలుజేద్దామనే తాపత్రయంతో ముందు వెనుక చూసుకోకుండా హడావుడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చేసిన వైకాపా ఇప్పుడు దానిని కూడా వెనక్కితీసుకోనేందుకు సిద్దపడుతోంది. అయినా అధికార తెదేపా దిగిరాలేదు.

 

“అవిశ్వాస తీర్మానం పెట్టుకొంటే పెట్టుకోండి..ఎదుర్కొనేందుకు మేము సిద్దం. కానీ తొమ్మిది మంది వైకాపా సభ్యులను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సభలో స్పీకర్ కి క్షమాపణలు చెప్పి, తన పార్టీ సభ్యులు మళ్ళీ సభలో అసభ్యంగా ప్రవర్తించారని లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినట్లయితే తాము పరిశీలిస్తామని తెదేపా తేల్చి చెప్పడంతో వైకాపా పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.

 

ఒకవేళ జగన్మోహన్ రెడ్డిసభలో క్షమాపణలు చెప్పి, అందుకు లేఖ కూడా ఇస్తే, అది అధికార పార్టీకి మరో గొప్ప ఆయుధంగా మారుతుంది. దానిని పట్టుకొని అధికార పార్టీ సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకాపాతో ఆడేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. పైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన తప్పును అంగీకరిస్తూ క్షమించమని వ్రాసిన ఆ లేఖ అసెంబ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కనుక అందుకు ఒప్పుకోకపోయినట్లయితే, అప్పుడు తొమ్మిదిమంది వైకాపా యం.యల్యేలు అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు వారందరూ జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూ పార్టీలో అసమ్మతి వర్గంలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఏవిధంగా చూసినా వైకాపా అడ్డంగా బుక్ అయిపోయినట్లే కనిపిస్తోంది.

 

అయితే ఈ సమస్య నుండి వైకాపా మెల్లగా ఏదో విధంగా బయటపడవచ్చును. కానీ జరిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరికత్వకు అద్దంపట్టేవిగా ఉన్నాయి. అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను ఎవరినీ సంప్రదించరనే సంగతి స్పష్టం అవుతోంది. ఆయన ఈ విధంగా పార్టీకి శల్యసారధ్యం చేస్తూ తను చేస్తున్న తప్పులకు పార్టీని భారీ మూల్యం చెల్లింపజేస్తున్నట్లుంది. పాపం వైకాపా!