ఎవడబ్బ సొమ్మని కులికేవు జగన్మోహనా!
posted on Jun 15, 2024 5:52PM
ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతని పక్కనే వుండే వాళ్ళెవరైనా తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిందని చెప్పండ్రా.. తానింకా ముఖ్యమంత్రి పదవిలోనే వున్నానని అయ్యగారు భ్రమపడుతున్నట్టున్నారు. అందుకే, ముఖ్యమంత్రిగా ఏయే బిల్డప్పులు ఇచ్చాడో, పదవి ఊడిపోయి ఇన్ని రో్జులైనా తగ్గేదేలే అంటూ సదరు బిల్డప్పుని కంటిన్యూ చేస్తున్నారు.
అయ్యగారు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు క్యాంపు కార్యాలయం దగ్గర జనం డబ్బుతో నిర్మించిన రోడ్డులో అప్పట్లో వేరేవాళ్ళు ఎవర్నీ అనుమతించేవారు కాదు. ఇప్పుడు పదవి ఊడిపోయిన తర్వాత కూడా ఆ రోడ్డు మీద ఎవర్నీ రానివ్వడం లేదు. జగన్ ఆదేశాలతో జగన్ సెక్యూరిటీవాళ్ళు ఆ రోడ్డుని ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు. 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్డులోకి ఎవర్నీ రానివ్వకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.
అలాగే జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేట్ కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో జనం సొమ్ముతో ఇంటి చుట్టూ ప్రహరీ మీద 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, ఇంకా సోలార్ ఫెన్సింగ్ దాదాపు మూడు కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి మొత్తం ప్రజల సొమ్ముతో కొన్నవే. గతంలో ఈ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సచివాలయం హెచ్ బ్లాక్‌లో వున్న యూపీఎస్, కంప్యూటర్లను అక్కడి నుంచి తరలించి ఇక్కడ పెట్టారు. అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్న తర్వాత జనం సొమ్ముతో కొన్న ఫర్నిచర్, కంప్యూటర్లు మొత్తాన్ని సొంత పార్టీ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు.
గతంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి చెందిన రెండు మూడు కంప్యూటర్ల లాంటివి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని ఆయన మీద కేసు పెట్టి, ఆయన్ని మానసికంగా వేధించి, మానసికంగా క్రుంగిపోయేలా చేసి, ఆత్మహత్య చేసుకునేట్టు చేసిన ఈ జగన్ రాక్షసుడు.. ఇప్పుడు మాత్రం తన పదవి ఊడిపోయినా ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇవ్వకుండా తన తాత, తండ్రి సంపాదించిన సొమ్ములా చక్కగా వాడుకుంటున్నారు. మరి అప్పట్లో కోడెల శివప్రసాదరావు మీద కేసులు పెట్టి అంతగా హింసించారే.. ఇప్పుడు ఈ జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ ఒక్క నేరం మీదే ఎలాంటి శిక్ష విధించాలి? కరెక్ట్.గా దొరకాలేగానీ ఈ జగన్ అంతకు అంత అనుభవించడం ఖాయం!