వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్న జగన్ సర్కార్

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర రెండవ విడతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలపై తూర్పార పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుండి కూడా రివర్స్ కౌంటర్లు వస్తున్నాయి. రెండవ విడత తొలిరోజు యాత్రలో భాగంగా ఏలూరులో గత ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా రేపాయి. రాష్ట్రంలో ఇప్పటికి 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలో ఉండే వాలంటీర్లు రాష్ట్రంలో మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించారు. తమపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని తగిన ఆధారాలను చూపించాలని నోటీసులు పంపారు. వాలంటీర్లు ఘాటుగా స్పందించినా మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గని పవన్.. కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నట్లు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని, కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నట్లు పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్‌ క్రాస్‌ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్‌ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు. 

అయితే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వలంటీర్లకు మద్దతు కూడగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ కొందరు వైసీపీ నేతలు వారికి సన్మానాలు చేయగా.. ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే వాలంటీర్ కాళ్ళు కడిగి పవన్ కళ్యాణ్ తరపున క్షమాపణలు కోరారు. కాగా, ఇప్పుడు వాలంటీర్లకు ప్రజల మద్దతు కోరుతూ వివిధ పథకాలలో లబ్ది పొందిన వారికి వాయిస్ కాల్స్ చేస్తున్నారు. రకరకాల నంబర్ల నుండి ఐవీఆర్ కాల్స్ చేస్తూ ప్రజలందరూ పవన్ వ్యాఖ్యలను తీవ్రం ఖండిస్తూ వాలంటీర్లకు అండగా నిలబడాలని కోరుతున్నారు. వాలంటీర్లు అవ్వా తాతలను ఉదయాన్నే నిద్రలేపి పెన్షన్ ఇస్తున్నారని, ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనే వరకు అండగా నిలబడదామని, వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పేవరకు వారి పోరాటానికి మద్దతుగా ఉందామని కాల్స్ ద్వారా కోరుతున్నారు. మరి ఈ కాల్స్ కు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu