జగన్ వై నాట్ 175 ధీమా ఎక్కడ?.. ఓటమి గండం గట్టెక్కేదెలా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు.  కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు. అంత సీన్ లేదని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అప్పటిలో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ధీమా ఏంటి అన్న విస్మయం వ్యక్తమైంది. అయితే ఆ ధీమా మాత్రం పార్టీ మొత్తంలో జగన్ ఒక్కరిలోనే కనిపించింది. మంత్రులూ, నాయకులూ మాత్రం తమకు గడపగడపలో ఎదురైన పరాభవ అనుభవంతో  ఆయన మాట నమ్మకపోయినా.. ఏమో జగన్ ధీమా ఏమిటో? అని గెలుపు ఆశలను నిండా నింపుకున్నారు. అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్ లో ఆ ధీమా సన్నగిల్లుతూ వచ్చిందన్నది ఆయన ప్రసంగాలలో, అసహనంలో, ఫ్రస్ట్రేషన్ లో ప్రస్ఫుటంగా కనిపించింది కూడా.

తీరా ఎన్నికలు  రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయింది. ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుంది. సెంటిమెంటు, దౌర్జన్యం, విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపు దారి చూపలే కపోవడంతో ఇక ఆయన తన విశ్వాసాన్ని మార్చుకుని వాస్తును శరణుజొచ్చారు. తాడేపల్లిలోని తన అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీసులలో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు. జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.  కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్ లోనే కూల్చివేతల పర్వానికి తెరతీయాల్సి వచ్చింది.    

వాస్తు పండితుల సూచనలకు అనుగుణంగా  జగన్ నివాసం  క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేత పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.  ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే  ఒక్క పురుగు కూడా  ఆ కంచెను దాటి లోనికి ప్రవేశంచే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు.  ఇప్పడు వాస్తుదోషమంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు. స్వతహాగా క్రైస్తవుడైన జగన్ కు ఇటువంటి నమ్మకాలు లేవు. తిరుమలలో తనకు వెంకన్న దేముడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్ ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్ లోనే మార్పులు చేయడానికి వెనుకాడలేదు.  మొత్తమ్మీద ఓటమి భయం జగన్ ను ఎంతగా వెంటాడుతోందో  ప్యాలెస్ లో వాస్తుదోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.