పట్టువదలని జగన్మార్కుడు

 

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎవరికయినా మాట ఇస్తే దానికి తిరుగు ఉండేది కాదని చెపుతారు. ఆయనకి, ఆయన కుర్చీకి కూడా వారసుడినని దృడంగా నమ్మేఆయన కొడుకు జగన్ కి ఆ గొప్ప లక్షణం రాకపోయినా మంచి పట్టుదల, దానికి విరుగుడుగా తొందరపాటు ఉన్నాయి.

 

ఈ తొందరపాటు కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్ర విభజన ప్రకటన కూడా చేయక ముందే రాత్రికి రాత్రి తెలంగాణా నుండి వయా సమన్యాయం టు సమైక్యాంధ్రలోకి వచ్చిపడ్డారు. అయితే ఆ తరువాత తన తొందరపాటుకి తీరికగా చింతిస్తూ మళ్ళీ తెలంగాణా లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక జైలు నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు అంత దూకుడే. తత్ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డేడ్’ అన్న రీతిలో చెప్పటిన ప్రతీ వ్యవహారం బెడిసి కొడుతూనే ఉంది, చివరికి నిన్నమొన్నటి డిల్లీ టూర్ తో సహా! అయినా ఆ దూకుడు తగ్గలేదు.

 

 

రాజశేఖర్ రెడ్డి తనను నమ్ముకొన్న వాళ్ళకోసం ఎంత దూరమయినా వెళ్ళగలరని ప్రతీతి అయితే అందుకు పూర్తి విరుద్దంగా తనకు ఎంత నమ్మకస్తులనయినా, కోపం వస్తే క్షణంలో వదిలించుకోవడం జగన్ లక్షణం. కొండ సురేఖ, సబ్బం హరి వంటి వారు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనబడుతుంటే, అటువంటి అనామకులు ఇంకెందరున్నారో ఆ పార్టీకే తెలియాలి.

 

వైకాపాకు మొదటి నుండి విదేయుడిగా ఉంటూ, పార్టీని అనకాపల్లి పరిసర ప్రాంతాలలో ఎంతో బలోపేతం చేసిన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణని, తెదేపా నుండి పార్టీలోకి దూకిన దాడి వీరభద్ర రావు కోసం వదులుకోవడానికి కూడా జగన్ సిద్దపడటం ఇందుకు మరో చక్కటి ఉదాహరణ. అయితే మంచి రాజకీయ అనుభవమున్న కొణతాల సోదరులు, వివేకం ప్రదర్శించి వెనక్కి తగ్గడం వలననే వారు ఇప్పటికీ వైకాపాలో కనిపిస్తున్నారు.

 

జైలులో ఉన్నంత కాలం కోర్టులు ఎన్ని సార్లు బెయిలు తిరస్కరిస్తున్నా, చివరికి సుప్రీం కోర్టు ఇక బెయిల్ పిటిషను వేయడానికి వీలేదని చెప్పేవరకు కూడా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా బెయిలు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. బెయిలు పొంది బయటకి వచ్చిన రెండు రోజులకే ఇడుపులపాయ, గుంటూరు వెళ్లేందుకు మరో పిటిషను వేస్తే కోర్టు ఇడుపులపాయకు మాత్రం అనుమతిచ్చింది. ఆ తరువాత వెంటనే మరో పిటిషను వేసి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు స్టేట్ పర్మిట్ పొందగలిగాడు. ఆ తరువాత డిల్లీకి కూడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు యావత్ దేశం పర్యటించేందుకు అనుమతి కావాలని మరో పిటిషను వేస్తే దానిని సీబీఐ కోర్టు తిరస్కరించింది.

 

అయితే సీబీఐ, కోర్టులు, పిటిషన్లు, చార్జ్ షీట్లు, కేసులు, విచారణలు తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన తరువాత ఇక కొత్తగా బాధపడేందుకు ఏముంటుంది గనుక? అందుకే వెంటనే మరో పిటిషను వేసాడు. ఈ సారి కోల్ కత వెళ్లేందుకు అనుమతి కోరుతున్నాడు. ఈ కేసుపై సీబీఐని కౌంటర్ ఫెయిల్ చేయమని ఆదేశిస్తూ, కోర్టు కేసుని మంగళవారానికి వాయిదా వేసింది.

 

ఇక సోమవారంనాడు లేపాక్షి చార్జ్ షీట్ కేసు చేపట్టిన సీబీఐ కోర్టు దానిని డిశంబర్ 3కి వాయిదా వేసింది. అది కాక అక్రమాస్తుల కేసుల్లో ఉన్న మరో తొమ్మిది చార్జ్ షీట్లపై కోర్టు విచారణ జరుగవలసి ఉంది. ఇదంతా చూస్తుంటే కేవలం జగన్ కేసులకి, పిటిషన్లకే ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థ ఏర్పరచవలసిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే కోర్టులు ఇక వేరే ఏ ఇతర కేసులు చూసేందుకు వీలుపడదేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News