పవన్ దూకుడు.. బాబు వ్యూహమేనా?

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి విజయ యాత్రతో ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాడు. అధికార పార్టీ నేతలపై.. ముఖ్యంగా సీఎం జగన్‌పై పోట్లగిత్తలా కాలుదువుతున్నాడు. ఈ క్రమంలో వైసీపీ నేతల మాట తీరుకు సరిఅయిన సమాధానం ఇస్తున్నాడు. ఇన్నాళ్లు మాజీ సీఎం, టీ-డీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీ-డీపీ నేతలను ఓ ఆట ఆడుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఆ ఫోకస్‌ను పవన్‌ వైపుకు మళ్లించారు.

ఇటీ-వల ఏలూరులో జరిగిన వారాహీ యాత్రలో వాలంటీ-ర్స్‌ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాక్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం వెనుక కొందరు వాలంటీర్స్‌ ఉన్నారని, వారు సేకరించిన డేటా తప్పుడు పనులకు ఉపయోగపడుతుందని పవన్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వాక్యలపై వాలంటీర్స్‌, వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వాలంటీర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మలు దహనం చేయగా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ వర్సెస్‌ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వాలంటీర్‌ ఫిర్యాదుతో పోలీసులు పవన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు.

వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై దృష్టిసారించడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఒంటికాలుపై లేచిన వైసీపీ మంత్రులు ప్రస్తుతం వారి దృష్టిని పవన్‌ వైపు మళ్లించారు. మరోవైపు చంద్రబాబు అండ్‌ కో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ లెవల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. పొత్తుతో వెళ్లాలా.. పొత్తు పెట్టుకుంటే జనసేనతో పాటు బీజేపీతోనూ చేతులు కలపాలా? అనే విషయాలపై సర్వేలు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. సర్వేల ఆధారంగా పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు  ఇవ్వాలి. బీజేపీకి ఎన్నిస్థానాలు కేటాయించాలి..? వారికి ఏం నియోజకవర్గాలు కేటాయించాలనే విషయంపై చంద్రబాబు లెక్కలువేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కనీసం 120 నుంచి 130 స్థానాల్లో పాగా వేయాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ క్రమంలో దీంతో ఓ వ్యూహంతో వారు ముందుకెళ్తున్నారన్న ప్రచారమూ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.

అధికార పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ దూకుడు వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓ బలమైన సామాజిక వర్గం ఓటర్లను తమవైపుకు మళ్లించడమే చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యూహంలో భాగంగానే ఇన్నాళ్లు టీడీపీ నేతలే టార్గెట్‌ విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోకస్‌ను పవన్‌ కళ్యాణ్‌ తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం వైఎస్‌ జగన్‌ వైపు ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువే. పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేతలను టార్గెట్‌ చేయడంద్వారా ఆటోమేటిక్‌గా వైసీపీ నేతలు పవన్‌కు కౌంటర్‌ ఇస్తుంటారు. ఈ క్రమంలో కాపు ఓటర్లు పవన్‌ వైపు సానుభూతి చూపే అంశాలు లేకపోలేదు. దీనికితోడు వారాహి యాత్రల్లో మీరంతా కలిసిఉంటే తాను సీఎం అవుతానంటూ పవన్‌ పదేపదే చెబుతున్నాడు. కావు సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒకరు సీఎం అవ్వాలని ఆ సామాజిక వర్గం భావిస్తుండటం సహజమే. గతంలో చిరంజీవికి బలమైన మద్దతుగా ఆ సామాజిక వర్గం నిలిచింది. కానీ, చిరంజీవికి సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. కాపు సామాజిక వర్గం జగన్, పవన్ మధ్య చీలిపోయి ఉంది.

కాపు సామాజిక వర్గంను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి దూరం చేయాలంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్రంట్‌లైన్లో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహంలో భాగమని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేయటానికి పెద్దగా ఏమీ ఉండవు. కేవలం బూతులు తిట్టడం మాత్రమే.  ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఫ్రంట్‌లైన్లో పెట్టడం ద్వారా కాపు సామాజిక వర్గంతో పాటు చంద్రబాబు అంటే గిట్టనివారు. ప్రస్తుతం వైసీపీకి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు పలుకుతున్న వారు ఆ పార్టీకి దూరమై పవన్‌ వైపు వస్తారన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అలా పవన్‌ కళ్యాణ్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తుతో వెళ్లాలని ఇప్పటికే పవన్‌, చంద్రబాబు నిర్ణయించుకున్న క్రమంలో ఆ ఓటు బ్యాంకు వైసీపీ ఓటమికి ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో వారిద్దరు అనుకున్నట్లే సీఎం జగన్‌ వారి వ్యూహంలో చిక్కారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu