కోటంరెడ్డి తిరుగుబాటు వైసీపీ స్క్రిప్టేనా?

నెల్లూరు పెద్దారెడ్ల అసంతృప్తి ఒక వైపు వైసీపీలో కాక రేపుతుంటే.. మరో వైపు తెలుగుదేశంలో ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందా అన్న అనుమానాలు  తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కోటం రెడ్డి తీరు పట్ల తెలుగుదేశంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక ట్వీట్ రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సరిగ్గా నెల రొజుల కిందటే.. కోటం రెడ్డి జగన్ పిలుపు మేరకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ఆయనతో బేటీ అయిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కోటంరెడ్డి బహిరంగంగా తన ఫోన్  ట్యాప్ చేస్తున్నారంటూ మీడియా ముందు ప్రకటించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో తాను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తానంటూ ప్రకటించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

గత మూడున్నరేళ్లుగా  తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేతపైనా ఇష్టారీతిగా నోరు పారేసుకున్న కోటం రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. తన రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చేతుల్లోనే అనడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు అనుమానిస్తున్నాయి.  2019లో ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు చేశారు. చంద్రబాబుది భస్మాసుర హస్తం అంటూ విమర్శించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబను విఫల నాయకుడిగా విమర్శించారు. ఇప్పుడు అప్పట్లో కోటం రెడ్డి చేసిన విమర్శలన్నీ తెలుగుదేశం సర్కిల్స్ లో విపరీతంగా సర్క్యలేట్ అవుతున్నాయి. కోటంరెడ్డిని తెలుగుదేశం గూటికి చేరనివ్వవద్దంటూ అధినేతకు విజ్ణప్తులు  చేస్తున్నాయి.

 అంతే కాకుండా.. రాష్ట్రంలో రోజు రోజుకూ జగన్ ప్రభ మసకబారుతుండటం, వైసీపీ పట్ల ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పక్కా వ్యూహంతోనే కోటం రెడ్డి సొంత పార్టీపైనా, జగన్ పైనా విమర్శలతో బయటకు వచ్చారన్న అనుమానాలు దేశం శ్రేణుల్లో వెల్లువెత్తుతున్నాయి. అలాగే వివేకా హత్య కేసులో తాడెపల్లి ప్యాలస్ డొంక కదులుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చే వ్యూహంతో కూడా వైసీపీ కోటం రెడ్డి చేత కావాలనే సొంత పార్టీపై ఆరోపణలు చేయిస్తోందన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్లను పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆ అంశం నుంచి దృష్టి మరల్చడానికే కోససీమలో చిచ్చు రేపారనీ, ఇందు కోసం వైసీపీ సొంత ఎమ్మెల్యే ఇంటిని దగ్ధం చేయించడానికి కూడా వెనుకాడలేదనీ గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి విషయంలో, ఆయన ఆరోపణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్న అనుమానాలనే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ ద్వారా బయటకు వెల్లడించారని అంటున్నాయి.   గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ట్వీట్ లో..  వైసీపీ కోవర్ట్ డ్రామా ఆరంభమైంది.. రాబోయే వ్యూహం సినిమా స్క్రప్ట్ లా ఉంది.. తెలుగు తమ్ముళ్లూ జర జాగ్రత్త అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.