టీడీపీలోకి మాజీ మంత్రి.. అనకాపల్లి ఎంపీగా పోటీ!!

 

అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు, ఆమంచి కృష్ణమోహన్ వంటి నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. అయితే వారికి టికెట్లు దక్కవని తెలిసే పార్టీని వీడారు, వారు వెళ్లడం వల్ల టీడీపీకి వచ్చే నష్టం ఏంలేదని అధిష్టానం చెప్తూ వస్తుంది. మరోవైపు టీడీపీకి కూడా వలసలు స్టార్ట్ అయ్యాయి. పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమవ్వగా.. ఆయన బాటలోనే మరో సీనియర్ నేత కూడా సిద్ధమయ్యారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ నెల 28న ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొణతాల కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం కూడా ఆయన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌గా ఉన్న కొణతాల ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు. అయితే త్వరలో తాను ఏదో ఒక పార్టీలో చేరుతానని కొంతకాలం క్రితమే ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో చేరడం కరెక్ట్ అని భావించిన ఆయన టీడీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన టీడీపీలో చేరితే అనకాపల్లి ఎంపీ సీటు అడిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.