కేసీఆర్ మౌనం వ్యూహత్మకమేనా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే టార్గెట్‌తో టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో ఆయన  మౌనంపై  రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది.  ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సమావేశం అయ్యేందుకు సన్నద్ధమౌతుంటే..  అసలు మోడీ వ్యతిరేకతే పునాదిగా జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

వాస్తవానికి ఇలాంటి సమావేశాన్ని కేసీఆర్ ముందుండి నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా అసలు ఆయన హాజరవుతారా? లేదా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనం అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు మాత్రం వేరే విధంగా విశ్లేషణలు చేస్తున్నారు.  అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మరీ బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల తుటాలు కురిపించే కేసీఆర్ ఇటీవలి కాలంలో అసలు ఆ దిశగా గొంతు కూడా సవరించుకోవడం లేదు. ఏవైనా సభలూ సమావేశాలలో మాట్లాడినా, ఆయన విమర్శలన్నీ కాంగ్రెస్ పైనే ఉంటున్నాయి కానీ బీజేపీ ఊసు కానీ, ప్రధాని మోడీ మాట కానీ ఎత్తడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయానికి ఎంతో కీలకం అయినటువంటి కర్నాటక ఎన్నికలలో ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని అంతా భావించినప్పటికీ అసలా వైపునకే కన్నెత్తి చూడలేదు.  

రెండువేల నోట్ల రద్దు సందర్భంగానూ, కేజ్రీవాల్ స్వయంగా వచ్చి మద్దతు కోరినా ఆచితూచి స్పందించడం ద్వారానూ అసలు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? లేక మద్దతు పలుకుతున్నారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత  అరెస్ట్ ఖాయమంటూ జరిగిన ప్రచారం ఇప్పుడు జరగడం లేదు. అసలా కేసులో ఆమె ఆరోపణలు నిజంగా ఎదుర్కొన్నారా అన్నట్లుగా సీబీఐ, ఈడీలు మౌనం వహించాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం వెనుక ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద పార్టీ పేరు నుంచి తనకు అచ్చివచ్చిన తెలంగాణ పదాన్ని సైతం తొలగించి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధమైన కేసీఆర్ ఇప్పటికిప్పుడైతే  దేశ రాజకీయాల్లో  ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ ఏ వేదిక మీద నుంచి మాట్లాడినా  ఆ ప్రసంగ లక్ష్యం మాత్రం బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్ గానే ఉండేది. 

 తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని హెచ్చరించే వారు. అటువంటిది ఇటీవలి కాలంలో ఆయన బీజేపీని కానీ, ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. చివరాఖరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఆయన ప్రసంగంలో కూడా జాతీయ అంశాలను ప్రస్తావించలేదు. దీంతో ఆయన బీజేపీకి అనుకూలంగా.. స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్  వర్గాల్లోనే  వ్యక్తమౌతోంది.