సంచలనం... చంద్రబాబు వల్లే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?  

తెలంగాణ పీసీసీ ఎంపిక వ్యవహారం కాక రేపుతోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతుండగా.. అదే సమయంలో అసమ్మతి గళం వాయిస్ పెరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై ఘాట్ కామెంట్స్ చేశారు. 

పీసీసీ పదవి కార్యకర్తకు  ఇస్తారు అనుకున్నానని కాని అలా జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి పీసీసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని రేవంత్ కు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టి కాంగ్రెస్ ను  టి టీడీపీ లాగా మార్చవద్దన్నారు. 
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు వెంకట్ రెడ్డి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతానన్నారు. తనను  కలవడానికి ఎవరు రావద్దన్నారు సూచించారు వెంకట్ రెడ్డి.  

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు మాట్లాడటం వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి అన్నారు. 2018లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేశాయని, అప్పటినుంచి రాహుల్ తో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. 

అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్న వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తు్ననారు. చంద్రబాబుకు అంత అవకాశం ఉంటే ఏడు నెలలుగా పీసీసీ పదవిని ఎందుకు భర్తీ చేయలేకపోయారని చెబుతున్నారు. కొందరు నేతలు తమ రాజకీయ పబ్బం కోసం సంబంధం లేని విషయంలో చంద్రబాబును లాగుతున్నారని మండిపడుతున్నారు.