రెచ్చిపోయిన ఐర్లాండ్ స్టర్లింగ్...వెస్టిండీస్ ఇంటికి!
posted on Oct 21, 2022 10:47PM
వెస్టిండీస్.. రెండుపర్యాయాలు టీ20 ప్రపంచ ఛాంపియన్. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఆరంభమైన ఛాంపియన్‌షిప్ అర్హత కూడా సాధించలేక ఇంటిదారి పట్టింది! శుక్రవారం అర్హత పోటీలో చిన్న జట్టు ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం కనీ వినీ ఎరుగనిది. పాల్ స్టర్లింగ్ కేవలం 48 బంతుల్లో 66 పరుగులు చేయడమే కాదు 3వేల పరుగులు అధిగమించి టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆరుగురు ఘనుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఊహించని విధంగా చిన్న జట్టు స్టార్ బ్యాటర్ ఏకంగా ఆరాన్ ఫించ్, డేవిడ్ వార్నర్ వాటి సూపర్‌స్టార్స్ చెంత చేరి హేమా హేమీ జట్లకు తన సత్తా తెలియజేశాడు. ఈ పర్యాయం గ్రూప్ స్థాయిలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ నుంచి బయటపడింది.
పాల్ స్టర్లింగ్ పెద్దగా క్రికెట్ చర్చల్లో వినిపించని ప్లేయర్, కానీ ఈ ఏడాది ఆరంభంనుంచి ఆడిన ప్రతీ టీ20 మ్యాచ్‌లోనూ కనీసం అర్ధసెంచరీ చేసి తన క్రికెట్ ప్రత్యర్ధులను ఖంగారుపెట్టడానికి సిద్ధపడ్డాడు. గత ప్రపంచకప్ పోటీల తొలిరౌండ్‌లోనే చిత్రంగా స్టర్లింగ్ వైఫల్యం కారణంగానే ఐర్లాండ్ జట్టు వెనుదిరగవలసి వచ్చింది. 32 ఏళ్ల స్టర్లింగ్ వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేసాడు అనొచ్చు. వాళ్లు ఇతని మీద ఏమాత్రం ప్రభావంచూపలేదు. పవర్‌ప్లేలో మరీ రెచ్చిపోయి వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఆటలో ఎంతో ఏకాగ్రత, చెప్పుకోదగ్గ షాట్ సెలక్షన్‌తో అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాడు. లోక్రాన్ టక్కర్‌తో కలిసి 146 పరుగుల లక్ష్యా న్ని ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే అధిగమించేట్టు చేశాడు. ఇలాంటి ఎంతో ఒత్తిడితో కూడుకున్న ప్రపంచకప్ పోటీల్లో జట్టు విజయానికి కీలకపాత్ర వహించడంలో పాల్ తన బ్యాటింగ్ సత్తాని, సూపర్ టెక్నిక్‌నీ ప్రదర్శించాడు. ప్రపంచకప్‌కి రావడా నికి ముందు ఐర్లాండ్ ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో 9 ఓడిపోయింది.
అయినా ఎంతో అద్బుతంగా ఆడి వెస్టిండీస్ వంటి జట్టును టోర్నీ నుంచి బయటికి పంపిన ఘనత సంపాదించుకుంది. పరుగుల వరదతో స్టర్లింగ్ అందరి మనసు ఆకట్టుకున్నప్పటికీ, అతనితో పాటు జార్జ్ డక్రెల్, కర్టిస్ కాంఫర్ కూడా అద్భుతంగా స్కాట్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో ఆడారు. లక్ష్యసాధనలో తొలి స్థాయిలోనే బల్బెరిన్ కేవలం 23 బంతుల్లో 37 పరుగులు సాధించడంలో విండీస్ బౌలర్లను చితక్కొట్టాడు. అతని ధాటికి విండీస్ ఫీల్డింగ్ లోపాలు స్పష్టమయ్యాయి. కాగా లెగ్‌స్పిన్నర్ గారెత్ డిలానే 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంలో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చూపాడు. విండీస్ బ్యాటర్లు అతని ధాటికి ఇన్నింగ్స్ నిలబెట్టుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండాన్ కింగ్ అద్బుతంగా ఆడాడు. 48 బంతుల్లో వేగంగా 62 పరుగులు తీయడంలో తన బ్యాటింగ్ సత్తా ప్రకటించాడు. అతన్ని నిలువరించడానికి ఐర్లాండ్ తంటాలు పడిందనాలి. మొత్తానికి ఐర్లాండ్ శుక్రవారం మ్యాచ్‌లో అన్ని విధాలా బ్రహ్మాండంగా ఆడి ఎంతో అనుభవం ఉన్న వెస్టిండీస్‌కు ఛాంపియన్‌షిప్ లో కొనసాగే అవకాశాలు లేకుండా చేసింది.