ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్ళినట్టో...!

ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం. నిన్న అంటే, సోమవారం నాడు ఇబ్రహీమ్ రైసీ ఇస్లామాబాద్‌కి వచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ని  కలిశారు. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ ప్రధానమంత్రిని స్నేహపూర్వకంగా కలిస్తే తప్పేంటన్న సందేహాలు ఎవరికైనా కలగొచ్చు. అయితే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహసంబంధాలు లేవు. మొదట్నుంచీ ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా గత జనవరిలో రెండు దేశాల సరిహద్దులో పరస్పరం వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ‘మేమేం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న జైష్ అల్ అద్ల్ అనే అతివాద గ్రూపు మీద దాడి చేశాం’ అని ఇరాన్ చాలా తెలివిగా చెప్పినప్పటికీ, పాకిస్థాన్‌కి ఆ సంఘటన ఆగ్రహాన్ని తెప్పించింది. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా, ఇరాన్ భూభాగంలోకి ఒక క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వున్న తన రాయబారిని వెనక్కి పిలిపించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
మరి, ఇంతకాలం ఉప్పు, నిప్పులా వున్న ఈ రెండు దేశాల నాయకులు ఇంత అకస్మాత్తుగా ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ స్నేహగీతాన్నిఆలాపించడం వెనుక కారణాలను అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దంలోకి ఈమధ్య ఇరాన్ కూడా ఎంటరైంది. కొద్ది రో్జుల క్రితమే ఇజ్రాయిల్ మీద ఆయుధాలతో దాడులు కూడా చేసింది. ఇజ్రాయిల్ కూడా తక్కువదేం కాదు కదా.. ఇరాన్‌ని అదను చూసి దెబ్బ తీయడానికి ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వడానికి గానీ, ఇంధనం తదితర అవసరాల కోసం గానీ ఇరాన్‌కి పాకిస్తాన్‌తో అవసరం వుంది. అలాగే పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇటువైపు ఇండియాతో గొడవ, అటువైపు ఆఫ్ఘనిస్తాన్‌తో కయ్యం. దానికి తోడు దేశంలో తాండవిస్తున్న కరవు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కి కూడా అంతర్జాతీయంగా అండ కావలసి వుంది. దాంతో ‘నీకు నీ వారు లేరు.. నాకు నా వారులేరు’ అన్నట్టుగా ఈ రెండు దేశాలు కౌగిలించుకున్నాయి. అయితే ఈ కౌగిలి కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారుతుందా, లేక ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ గమనిస్తోంది.