‘ఉగాది పచ్చడి’ ఉగాది పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం.. ప్రసాదం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని షడ్రుచులున్న ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఉగాది పచ్చడిని శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చెబుతోంది.
ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తోంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు.
ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.
శిశిరంనుంచి వసంతంలోకి అడుగుపెట్టడం అంటే చల్లని వాతావరణంలోంచి తాపం ఎక్కువయ్యే వాతావరణంలోకి రావడమన్నమాట. శరదృతువు, వసంతకాలంలో వ్యాధులు తీవ్రత ఎక్కువ. శీతాకాలంలో శరీరం స్తబ్దుగా ఉండిపోతుంది. వాత, పిత్త, కఫ, శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఋతువులు మారే సంధికాలంలో ఇవి మరింత విజృంభిస్తాయి. ముఖ్యంగా వసంతం వచ్చీరాగానే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు, వీటినుండి రక్షణకు పెద్దలు ఉగాది పచ్చడిని రక్షణ పదార్థంగా అలవాటు చేశారని ప్రతీతి.
ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలన్నీ ఔషధాలే. బెల్లం మహిళలు మంచిది. ఐరన్ ధాతువు ఉంటుంది. ఇది రక్తపుష్టిని కల్గిస్తుంది. వేపపువ్వు చేదుగా ఉంటుంది. పొట్టలోని నులి పురుగులను సంహరిస్తుంది. యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ఉప్పు వాతాన్ని హరిస్తుంది. చింతపండు, మామిడిలోని పులుపు, వగరు వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మిరియాలు శరీరంలో వేడిని నియంత్రిస్తాయి. ఇన్ని విశిష్టతలున్నాయి కనుకే మనం ఉగాది పచ్చడిని ఇష్టంగా తిందాం.