వైసీపీకి ఊహించని షాక్.. రాజధాని వ్యూహం బెడిసికొట్టింది!!
posted on Jan 16, 2020 2:30PM

ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. అమరావతి భారీ నిర్మాణాలకు అనుకూలం కాదంటూ ఐఐటీ మద్రాస్ పేర్కొందని బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అమరావతిలో ఖర్చు ఎక్కువని, భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ మద్రాస్ పేరుతో మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. కొన్ని పత్రికలలోనూ ఐఐటీ మద్రాస్ పేరుతో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ కథనాలను ఐఐటీ మద్రాస్ వర్గాలు ఖండించాయి.
రాజధానిగా అమరావతి సురక్షితం కాదని నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్‌కు రాజధాని రైతుల మెయిల్ చేయగా...అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్ రిప్లయ్ ఇచ్చింది. అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పడం.. నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని పేర్కొంది. అమరావతిపై అలాంటి నివేదిక ఇవ్వాలంటే మెటీరియాలజీ విభాగం ఉండాలని, తమ సంస్థలో అలాంటి విభాగమే లేదని ఐఐటీ మద్రాస్ వర్గాలు తెలిపాయి. దీంతో అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలన్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసికొట్టిందని అమరావతి జేఏసీ తెలిపింది. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.