చంద్రబాబుకు తలనొప్పిగా ఏపీ ఉద్యోగులు.. లాంగ్ లీవ్.. స్వచ్ఛందంగా పదవీ విరమణ
posted on May 26, 2016 11:41AM
ఈ ఏడాది జూన్ కల్లా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ నవ్యాంధ్రకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆసక్తి చూపించిన ఉద్యోగులు మాత్రం ఆ తరువాత అంత ఆసక్తి చూపించడంలేదు. అద్దెలు, మౌలిక వసతుల కొరతలను సాకుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అక్కడికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువు ఇమ్మని కూడా కోరారు. అయితే విషయాన్ని గమనించిన చంద్రబాబు కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి రావాల్సిందే.. కొన్ని త్యాగాలు తప్పవు.. అన్ని శాఖలు ఒక దగ్గర ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని తేల్చి చెప్పేశారు. కానీ చంద్రబాబు ఎంత త్వరగా ఉద్యోగులను ఇక్కడికి తరలించాలని ప్రయత్నిస్తున్నా.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఏపీకి వచ్చే ఉద్యోగులు.. విజయవాడ. గుంటూరు వెళ్లి తమ ప్రభుత్వ కార్యక్రమాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే అసలే రావడానికి ఇష్టపడని ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తారా.. అందుకే ఏకంగా లాంగ్ లీవ్ పెట్టి ఈ వెతుకులాట సమస్య నుండి బయటపడాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వీలైతే కొంతమంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారట. మరోవైపు ఉద్యోగులు ఇక్కడికి రావడానికి సరిగ్గా నెల రోజులు టైం మాత్రమే ఉంది. నవ్యాంధ్రలో చూస్తే ఇప్పటివరకూ ఒక్క భవంతి కూడా నిర్మించలేదు. మరి ఉద్యోగులు వస్తారో.. రారో.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.