టీఆర్‌ఎస్‌‌కి 53 శాతం... కాంగ్రెస్‌‌కి 41 శాతం...  హుజూర్‌ కారుదేనంటున్న మిషన్ చాణక్య

 

తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌దే విజయమని ఎగ్జిట్‌ పోల్స్‌ అంటున్నాయి. హుజూర్‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నాయి. హుజూర్‌నగర్ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించిన మిషన్ చాణక్య సంస్థ... కచ్చితంగా కారుదే గెలుపు అంటూ బల్లగుద్దిమరీ చెబుతోంది. టీఆర్‌ఎస్‌కి 53శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, కాంగ్రెస్‌‌కు 41శాతం ఓట్లు, తెలుగుదేశానికి 2.1శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది. అయితే, టీఆర్‌ఎస్‌ కి తామే ప్రత్యామ్నాయమంటూ బరిలోకి దిగిన బీజేపీకి కేవలం 1.1శాతం ఓట్లు మాత్రమే వస్తాయని మిషన్ చాణక్య సంస్థ అంచనా వేసింది.హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర్నుంచి ఇప్పటివరకు వరకు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్‌‌కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. టీపీసీసీ చీఫ్ కంచుకోటైన హుజూర్‌‌నగర్‌లో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమంటోంది. 50శాతానికి పైగా ‎ఓట్‌ షేర్‌‌తో కారు దూసుకుపోతుందని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది. అంతేకాదు టీఆర్ఎస్ కి 18వేల నుంచి 25వేల వరకు మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కంటే కేసీఆర్ సంక్షేమ పథకాలే ఎక్కువగా ఓటర్లపై ప్రభావం చూపించాయని మిషన్ చాణక్య సంస్థ చెబుతోంది.

అయితే, సిట్టింగ్ సీటైన హుజూర్‌‌నగర్‌ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి హుజూర్‌‌నగర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇ‌క, తన స్వయంగా సతీమణిని బరిలోకి దింపిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఎలాగైనా గెలిచితీరాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇటు, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కూడా సర్వశక్తులూ ఒడ్డింది. అయితే, హోరాహోరీగా జరిగిన బైపోరులో... గులాబీ పార్టీదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. కానీ, తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మనని, కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఉత్తమ్ నమ్మకంగా చెబుతున్నారు. మరి హుజూర్ నగర్ ప్రజల తీర్పు ఎలా ఉండనుందో ఈనెల 24న తేలిపోనుంది.