స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్
posted on Jan 15, 2025 1:36PM
స్కిల్ కేసులో చంద్రబాబునాయుడికి సుప్రీంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిలు రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ఈ కేసు విచారించిన జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు 2023 నవంబర్ లో బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు బెయిలు పిటిషన్ రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వ్యులలో సుప్రీం కోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.
ఇలా ఉండగా చంద్రబాబు బెయిలు రద్దు కోరుతూ సీనియర్ జర్నలిస్టు తిలక్ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎవరు, ఈ కేసుతో మీకేం అంబంధం, పిటిషన్ దాఖలుకు మీకున్న అర్హత ఏమిటి అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ అభ్యంతరం తెలిపిన సుప్రీం కోర్టు, మరో సారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తిలక్ దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది.