నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉందంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రవేశ పెట్టిన 2023-2024 వార్షిక బడ్జెట్ ఎలా వుంది? ఎప్పటిలానే, అధికార పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా వుంది. ప్రతిపక్షాలకు అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుంది. నిజానికి, అక్షరం పొల్లు పోకుండా ఇదే బడ్జెట్’ను చిదంబరం (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రవేశ పెట్టి వుంటే,  బడ్జెట్ ఇదే అయినా కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా, బీజేపీకి అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుండి వుండేది. అలాగే ఇతర పార్టీల ప్రతిస్పందనలు. ఇప్పుడు బాగుందన్న నోళ్ళే అప్పుడు ఛీ’ అనేవి.. అలాగే, ఇప్పుడు ఛీ అన్న నోళ్ళు అప్పుడు ఆహో. ఓహో అనేవి.  సో ... బడ్జెట్ పై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, రాజకీయ పార్టీలే కాదు, మీడియా, మేథావులు సైతం రాజకీయ రంగులకు అనుగుణంగానే విశ్లేషణలు చేస్తున్నారు. 

సరే అదలా ఉంటే ఇది ఎన్నికల సంవత్సరం కూడా కావడం, మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్  కావడంతో, బీజేపీ బడ్జెట్ లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, బడ్జెట్‌లో ప్రకటించిన ప్రజానుకూల  చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 12 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజునుంచే మొదలైన, ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ సారధ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  ఫిబ్రవరి 1 నుంచి 12న వరకు సాగే ఈ ప్రచారంలో దేశంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చలు, విలేకరుల సమావేశాలు,  సెమినార్‌లు నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,  రైతు, యువజన విభాగాల అధినేతలతో సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ యూనిట్ల అధినేతలు, అసెంబ్లీలోని విపక్ష నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రజలకు అవగాహనా కల్పించేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందీ అంటే అందుకు ప్రత్యేక కారణం ఎన్నికలు. అవును ఈ సంవత్సరం ఏకంగా తొమ్మిది రాష్త్రాలలో  శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ కేంద్ర బడ్జెట్ మోడీ ప్రస్తుత  ప్రభుత్వం ప్రవేశ పెట్టీ చిట్ట  చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అందుకే, కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు  ఓక పథకం ప్రకారం బడ్జెట్ అనుకూల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఈ  ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి,  గతంలోనూ  బీజేపీ కేంద్ర బడ్జెట్‌లలో ప్రకటించిన సంస్కరణలు, కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించింది. ఇప్పుడ మళ్ళీ అదే పంథాలో ముందుకు సాగుతోంది.

అయితే, కేవలం ప్రచారంతోనే రాజకీయ ప్రయోజనం చేకురుతుందా, అంటే అనుమానమే అంటున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు లక్ష్యంగా, ఎలాంటి ఆకర్షణలు లేకుండా నిర్మలమ్మ వండి వడ్డించిన  బడ్జెట్  ప్రజలకు ఎంత వరకు రుచిస్తుందనేది అనుమానమే అంటున్నారు.  

అంతేకాదు, కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మల సీతారామన్  వరసగా ఐదవసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్, గత బడ్జెట్లకు భిన్నంగాలేదు. నిజానికి పేరుకే ఎన్నికల బడ్జెట్ కానీ, ఎన్నికల వాసనలు అసలే లేవు.  మధ్య తరగతికి పన్ను పోటు నుంచి కాసింత వెసులుబాటు కల్పించే చర్యలు మినహా, పెద్దగా ఓటు బ్యాంక్ తాయిలాలు ఏవీ కనిపించలేదు. అలాగని అందరినీ నిరాశ పరిచిందా అంటే అదీ లేదు. ఒక విధంగా మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తున్న... సుస్థిర అభివృద్ధి లక్ష్యంగానే ఈ వార్షిక బడ్జెట్ కూడా వుంది. ఇక ప్రజలు ఎలా రిసీవ్  చేసుకుంటారో చూడవలసి వుంది.