హౌస్ అరెస్ట్ ప్లీజ్.. బతిమాలుకుంటున్న వైసిపి నేతలు!

వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం  అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఏకపక్షంగా  మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి అని ఆదేశాలు మాత్రం జారీ చేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే  వైసీపీ నాయకులు పోలీసులలో తమకు పరిచయం ఉన్న వారికి ఫోన్ చేసి పార్టీ పిలుపు ఇచ్చిన రోజులలో తమన హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు! హౌస్ అరెస్టు అయిపోతే ఇక వేరే ఇబ్బందులు ఉండవని, బయటకు వెళ్లే పనిలేదని అనవసరపు ఖర్చు తప్పించుకోవచ్చు అని వారు భావిస్తున్నారు.
వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి రకరకాల ఆందోళనలకు పిలుపు ఇస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విటర్ నుంచి కదలకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులంతా  రోడ్లెక్కి పోరాటాలు  చేయాలని పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి, ఆస్తులు అమ్ముకున్న నాయకులు.. పార్టీ చెప్పే పోరాటాల పేరిట ప్రతిసారీ డబ్బుల ఖర్చుకు వెనుకాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో చేస్తానన్నా తరువాత ఆ పర్యటనల గురించి పట్టించుకోకవపోవడానికి ఇది కూడా ఒక కారణం అని, ఖర్చు పెట్టడానికి స్థానిక నేతలెవ్వరూ సిద్ధంగా లేరని ఒక ప్రచారం ఉంది.  కాగా.. తాజాగా విశాఖపట్టణంలోని క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తొలగించినందుకు వైసీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎప్పుడో ఏర్పాటు అయిన స్టేడియంకు ఉన్న పేరుకు ముందు జగన్ హయాంలో  వైఎసఆర్ పేరును ముందు జోడించారు. ఆ స్టేడియం విషయంలో ఆయన పాత్ర, ప్రమేయం ఏమీ లేనందున కూటమి ప్రభుత్వం ఆ పేరును తొలగించింది.  వైఎస్సార్ పేరు చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతున్నదంటూ వైసీపీ నేతలు కొందరు నానా యాగీ చేశారు. ఈలోగా విశాఖలో స్టేడియం వద్ద ధర్నా చేయాలని పిలుపు ఇచ్చారు. 
అసలే విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని జగన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క సీటులో కూడా పార్టీని గెలిపించని నగరం అది. అలాంటిచోట పార్టీ పిలుపు ఇచ్చే ఆందోళనకు జనాన్ని పోగేయడం అంటే.. నాయకులకు తలకు మించిన భారమే. ఆర్థికంగా చిలుము వదిలిపోతుందని వారి భయం. అందుకే.. పోలీసులను ఆశ్రయించి లోపాయికారీగా తమను హౌస్ అరెస్టులు చేయాల్సిందిగా బతిమాలు కున్నట్టుగా తెలుస్తోంది. 

పోలీసుల్ని బతిమాలి హౌస్ అరెస్టులు చేయించుకోవడం వైసీపీ నేతలకు ఇవాళ కొత్త కాదు. గతంలోనూ తిరుపతిలో నివాసం ఉండే ఓ వైసీపీ ఎంపీ.. తమ సొంత నియోజకవర్గంలో ఘర్షణల నేపథ్యంలో పర్యటనకు వస్తానని ప్రకటించి, వెళ్లే ధైర్యం లేక, తానుగా పోలీసులకు ఫోనుచేసి హస్ అరెస్టు చేయాల్సిందిగా వేడుకుని.. ఇల్లు కదలకుండా కూర్చున్నట్టుగా అక్కడ గుసగుసలు ఉన్నాయి.