ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి.. మావోలకు కేంద్ర హోంమంత్రి పిలుపు
posted on Apr 5, 2025 3:31PM

వరుస ఎన్ కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకువచ్చిన వేళ.. అమిత్ షా వారికి ఓ పిలుపునిచ్చారు. అయితే శాంతి చర్చలు కాదనీ, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కి రావాలని కేంద్ర హోంమత్రి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి జనజీనవ స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులందరికీ పునరావాసం కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్న హామీ ఇచ్చారు. ఒక వైపు ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుండగా.. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన చేయడం, అందుకు ప్రతిగా జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు నివ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నారు.
నక్సల్స్ ముక్త భారత్ లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే వందలాది మంది నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో హతమైన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా దాదాపు 86 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన ఘటన తెలంగాణలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు శనివారం (ఏప్రిల్ 5) లొంగిపోయారు. వీరంతా బీజాపూర్, సుక్మ జిల్లా సభ్యులుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలు వురు పోలీస్ అధికారులు ఉన్నారు.