డయాబెటిస్ ఉన్నవాళ్లకు నేరేడు ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు..!!
posted on Jun 22, 2024 9:30AM
భారతీయులకు ప్రాచీనులు అందించిన గొప్ప వరాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఆయుర్వేదం, యోగ ప్రథమ స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో భాగమైన పంచభూతాలు మనిషికి గొప్ప ఔషదంగా పనిచేస్తాయి. చెట్లు, పండ్లు, చెట్ల ఆకులు ఇవన్నీ ఎన్నో జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో వీటి గురించి గొప్ప సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా నేరేడు పండ్లు నోరూరిస్తూ ఉంటాయి. అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, నేరేడు పండ్ల గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు ఆకులు చాలా మంచివి. నేరేడు ఆకులు ఎలా ఉపయోగించాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..
నేరేడు పండ్ల ఆకులను డయాబెటిస్ కంట్రోల్ ఉంచడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులను గ్రైండ్ చేసి రసం తీసి ఈ రసాన్ని ఉదయోన్నే ఖాళీ కడుపుతో తాగాలి.
ఒక వేళ తాజా నేరేడు ఆకులు ఎప్పుడూ అందుబాటులో లేకపోతే నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకోవాలి.
నేరేడు ఆకుల పొడితో టీ కూడా చేసుకోవచ్చు. లేదంటే తాజా ఆకులతో కూడా టీ చేసుకోవచ్చు. ఇందుకోసం తాజా నేరేడు ఆకులు లేదా పొడిని నీటిలో వేసి బాగా ఉడికించాలి. తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనికి కాసింత నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు.
ప్రయోజనాలు..
నేరేడు ఆకులలో జాంబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
నేరేడు ఆకులను టీగా చేసుకుని తీసుకోవచ్చు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి ఆక్సీకరణ ఒత్తిడి కారణం అవుతుంది. నేరేడు ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల ఈ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
నేరేడు ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంట, నొప్పి సమస్యలు తగ్గిస్తాయి.
నేరేడు ఆకులను ఏ రూపంలో తీసుకున్నా ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియను పెంచుతాయి.
*రూపశ్రీ.