వేసవిలో తొందరగా నీరసం వస్తుందా?.. ఈ ఒక్కటి తింటే మ్యాజిక్ మీకే తెలుస్తుంది!
posted on Apr 26, 2023 3:00PM
వేసవి అంటేనే నీరసం. శరీరంలో తేమ శాతం నుండి శక్తి స్థాయిలు తగ్గించడం వరకు చాలా మార్పులు జరుగుతాయి. మంచినీళ్లతో శరీరాన్ని సమర్థవంతంగా ఉంచుకోవడానికి అంత ఛాన్స్ లేదు. తాగిన నీళ్లు తాగినట్టు చెమట ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. అందుకే పండ్లు, జ్యూస్ లు తీసుకోవాలని చెబుతారు. కానీ అవి కూడా ఎక్కువ కాలం శరీరాన్ని స్టేబుల్ ఉంచలేవు. ఈ అధిక వేడిమిని, ఎండల ధాటిని తట్టుకోవడానికి శక్తి పాళ్లు ఎక్కువ కావాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ అత్తిపండు. అందరూ అంజీర్ అని పిలిచే ఈ అత్తిపండు ఈ వేసవిలో శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఇంతకూ అత్తిపండులో ఉండే పోషకాలు ఏంటి? అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తిగా తెలుసుకుంటే..
అత్తి పండ్లు చెట్టుకు కాచినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండిన తరువాత ముదురు ఎరుపు రంగులోకి మారి చాలా తియ్యగా ఉంటాయి. ఇవి పండిన తరువాత మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెట్టి నిల్వ చేస్తారు. ఎండిన కొద్దీ మరింత తియ్యగా ఉంటాయి. పండిన పండ్ల కంటే ఎండిన వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. విటమిన్ ఎ,ఇ,కె, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ కారణంగా ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారు తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది గుండె సమస్యలున్న వారికి చాలా మంచిది. ఎముకలు పెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి.
అత్తి పండ్లలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని తగ్గించడం, ప్రోబయోటిక్‌గా పనిచేసి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. గట్‌లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను మరింత పెంచుతుంది. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో అంజీర్ పండ్లు సహాయపడతాయి. అంజీర్‌లో ఉండే అబ్సిసిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్‌లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
ఆంజీర్ వల్ల కలిగే ప్రయోజనాలు..
కాల్షియం ఫాస్పరస్ అంజీర్ లో అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు పొటాషియం సమస్య వస్తుంటుంది. పొటాషియం తగ్గితే సోడియం ప్రభావం పెరుగుతుంది. ఇలా జరిగితే రక్త పోటు చాలా ఎక్కువైపోతుంది. పొటాషియం మెండుగా ఉన్న ఆంజీర్ ను తీసుకుంటే కండరాలు, నరాల పనితీరు మెరుగవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు కండరాల పనితీరు మందగిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి బయటకు వెళ్లేముందు ఒక రెండు అంజీర్ తినడం, లేదా బ్యాగ్ లో వీటిని ఉంచుకోవడం మంచిది.
అంజీర్‌లో విటమిన్ సి, ఇ, ఎ వంటి పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో అధిక వేడిమి, సూర్యుడి ఎండ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని అత్తిపండు నియంత్రిస్తుంది. కొత్త చర్మకణాలు ఉత్పత్తి కావడం, చర్మం యవ్వనంగా ఉండటం అత్తిపండు వల్ల కలిగే లాభాలు.
◆నిశ్శబ్ద.