గ్లోబల్ సమ్మిట్ వేళ ఏపీ పరువు తీసిన తెలంగాణ మంత్రి హరీష్
posted on Mar 4, 2023 11:21AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ఆయనకు పట్టదు. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు వచ్చిన వారు కచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం అంశం నుంచి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగం పరిస్థితి, వ్యవసాయ రంగం ఎలా ఉంది, జనం సంతోషంగా ఉన్నారా, లేదా ప్రభుత్వ వ్యతిరేకతతో రగిలిపోతూ ఆందోళనల బాట పడుతున్నారా.. ఇలా ప్రతి విషయాన్నీ వారు పరిగణనలోనికి తీసుకుంటారు.
అన్నీ బాగున్నాయని వారు భావిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వెలిగిపోతోందా? లేక మసకబారిపోయి.. ఇక్కడ ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయా? అలా తరలిపోతుంటే అందుకు కారణాలేమిటి వంటి విషయాలనూ పరిశీలిస్తారు. అన్నిటికీ మించి రాష్ట్రంపై పొరుగు రాష్ట్రాలలో ఉన్న అభిప్రపాయమేమిటి అన్న విషయాలను కూడా తాము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు పరిగణనలోనికి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో రాష్ట్రంలో పరిస్థితులను గురించి మాట్లాడుకుంటే.. జగన్ హయాంలో ఈ నాలుగేళ్ల కాలంలో ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదు. సంక్షేమ పథకాల పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాలలో జగన్ బటన్లు నొక్కి మరీ సొమ్ములుపందేరం చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నా.. రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా ఉన్న దాఖలాలు కనిపించవు.
ఒకప్పుడు దేశానికే తలమానికంగాఉన్న విద్యుత్ రంగం ఇప్పుడు కుదేలైపోయింది. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక ప్రభుత్వోద్యోగులు జీతాలో రామచంద్రా అంటూ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమౌతున్నారు. ప్రజలకు మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ఇంత సొమ్ము పందేరం చేసింది అంటూ జనంలోకి వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి నుంచి ఛీత్కారాలే ఎదురౌతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బయటకు వెళ్లాలంటేనే అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు భయపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
ఇక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. చేసిన పనులకు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధిని చాటుకోవడానికి ఏపీలోని వెనుకబాటు తనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్ కోతల పరిస్థితి, ఆ రాష్ట్రంలో ఉండలేక తమ రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమల గురించి పదే పదే ప్రస్తావించి ఏపీ అన్ని రంగాలలోనే వెనుకబడి ఉందని చాటుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తమ రాష్ట్ర ప్రగతిని చాటుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి గతంలో క్రెడాయ్ సమావేశం వేదికగా ఏపీ దుస్థితిని కళ్లకు కట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలిపేశారు.
క్రెడాయ్ సమావేశంలో ఏపీ బండారం బట్టబయలు చేయడంతో.. ఇకపై రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయో రావో అనే ఆందోళన. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని కళ్లకు కట్టేలా వివరించారు. ఏపీలో విపరీత కరెంట్ కోతలు, ఊరూరా గుంతల మయమైన రోడ్లు, తాగు-సాగు నీటి కష్టాలను ప్రపంచానికి తెలిసేలా.. జగన్‌కు తెలిసొచ్చేలా( తెలిసొచ్చినా ఏపీ సీఎంగా వాటిని పట్టించుకోరనుకోండి) కీలకమైన క్రెడాయ్ వేదికగా గొంతెత్తి చాటారు కేటీఆర్. అక్కడితో ఊరుకోకుండా తెలంగాణ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏపీ వెళ్లి చూ డండి మీకే తెలుస్తుందని ముక్తాయించారు. ఆ తరువాత కూడా పలువురు తెలంగాణ మంత్రులు ఏపీ విషయంలో అక్కడి అభివృద్ధి లేమి విషయంలో చులకనగా వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఏపీలో గ్లోబల్ఇన్వెస్టర్ల సదస్సు జరుగుతున్న తరుణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏపీలో వ్యవసాయ రంగం ఎంతగా కుదేలైందో ఉదాహరణతో చెప్పి ఏపీ పరువును మూసీ నదిలో కలిపేశారు. ఆయనేమన్నారంటే.. ఏపీని అన్నపూర్ణగా అంటారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రవాదులు రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఏడారి అయిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయ్యింది. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం ఎలా పురోగమించిందో తెలియాలంటే ఏపీలో ఆ రంగం దుస్థితిని గురించి తెలుసుకుంటే సరిపోతుందన్నారు.
ఈ యాసంగిలో తెలంగాణలో 56లక్షల ఎకరాలలో వరి సాగుచేస్తుంటే.. ఏపీలో కేవలం 16లక్షల ఎకరాలలో వరి సాగు అవుతోందన్నారు. విద్యుత్, జలవనరుల విషయంలో ఏపీ అధ్వాన్న స్థితికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఏ రంగాలలో అయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అట్టడుగున ఉందో.. ఆ రెండు రంగాలలో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హరీష్ రావు చెప్పారు.