బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీ విన్యాసాలు.. సుమోటాగా కేసు నమోదు

హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు.  ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ తీసిన అకతాయి అప్సర్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్  చేశారు. అతడితో పాటు తుపాకీ విన్యాసాలను చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులో తీసుకున్నారు
      హైద్రాబాద్ లో తుపాకీతో హడావుడి చేయడం కొత్త కాదు. అనేక చోట్ల ఇలా విన్యాసాలు చేయడం మామూలైంది. 2022 అక్టోబర్ లో   బహదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ  యువకుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. యుపిఐ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుండగా బంక్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆ యువకుడు మరో ఇద్దరు యువకులను పిలిపించి   బంక్ సిబ్బందిపై దాడి చేశాడు. వచ్చిన ఇద్దరుయువకుల్లో ఒకరివద్ద గన్ ఉంది. సిబ్బందికి గన్ చూపిస్తూ నానాహంగామా చేశాడాయువకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇప్తెకార్ ను అరెస్ట్ చేశారు. 
2021 మార్చిలో తెలంగాణ భవన్ లో    టిఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్ మాజీ అధ్యక్షుడు   కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఎంఎల్సి ఎన్నికల సంబురాల్లో తన లైసెన్స్ గన్ తీసి  గాల్లో  కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. కార్యకర్తలు వారించడంతో గన్ లోపల పెట్టుకున్నాడు.
2024లో బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద  కొందరు యువకులు తుపాకీతో రోడ్ల మీద తిరిగారు.   
2016 మార్చిలో  నకిలీ పోలీస్ డమ్మీ రివాల్వర్ తో హల్ చల్ చేశాడు ప్రేమ జంటలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నకిలీ పోలీస్ ను ఎన్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
ఈ సంవత్సరం జనవరిలో బీదర్ ఎటిఎం దొంగల ముఠా అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యారు. 
హైద్రాబాద్ లో సంఘ విద్రోహశక్తులు తుపాకీలతో విన్యాసాలు చేస్తున్నా పౌరులు  సామాజిక బాధ్యతగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తున్న దాఖలాలు లేవు. తాజాగా బంజారాహిల్స్ లో అకతాయిల విన్యాసాలపై పోలీసులకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ అయినదాన్ని పోలీసులే స్పందించి సుమోటాగా కేసు నమోదు చేయాల్సి వచ్చింది.