ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా..

పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క జామ పండు తింటే చాలాసేపు ఆకలి అనే పదం మరచిపోతారు. అయితే ఎప్పుడూ జామ పండ్ల గురించేనా జామ ఆకుల గురించి తెలుసుకోవద్దా.. కాయలు లేకపోయినా సరే చెట్టుకు ఆకులైతే ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున జామ ఆకులను తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి.

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే జీర్ణసంబంధ సమస్యలు అన్నీ చిటికె వేసినట్టు మాయం అవుతాయి. జీర్ణాశయాన్ని శుద్ది చేయడంల, జీర్ణక్రియ పనితీరు మెరుగుపరచడంలో జామ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.

జామ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని ఉదయాన్నే నమిలి తింటే అద్బుతం జరుగుతుంది.  కాంప్లెక్స్ స్టార్స్ను చక్కెరగా మార్చడాన్ని జామఆకులు నిరోధిస్తాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో అదనపు చక్కెరలు, అదనపు కొవ్వుల నిల్వను అరికడుతుంది. దీని ఫలితంగా అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి జామ ఆకులు తోడ్పడతాయి.

ఉదయాన్నే జామ ఆకులు నమిలి తినడం లేదా జామ ఆకులతో టీ తయారుచేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేస్తే శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలలో అతిసారం ఒకటి. అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.  ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులు వేసి బాగా మరిగించాలి.  ఈ ద్రావణాన్ని రోజులో రెండుసార్లు కొద్దికొద్దిగా తాగాలి.  ఇలా చేస్తే లూజ్ మోషన్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

మధుమేహం ఉన్నవారికి జామకాయలు చాలామంచివి అనే మాట వినే ఉంటాం.  అయితే జామఆకులు కూడా చాలామంచివి. జామఆకులు శరీరంలోని సుక్రోజ, మాల్టోస్ శోషణను నిరోధిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 10నుండి 12వారాలపాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ ఇత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా  రోగనిరోధకశక్తి పెంచుతుంది.

జామఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులను బాగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ చెయ్యాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఉదయాన్నే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం వల్ల కొద్దిరోజులలోనే చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోవడానికి కూడా జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్ చేసి ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాయాలి. దీనివల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.

                                                             *నిశ్శబ్ద.