జీఎస్టీ … ఒక దేశం , ఒక పన్ను, అనేక గందరగోళాలు!

 

కౌంట్ డౌన్ స్టార్టైపోయింది! దేనికో తెలుసుగా? ఎస్… జీఎస్టీకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే గడువుంది. తరువాత యావత్ దేశం కొత్త పన్నుల వ్యవస్థలోకి అడుపెడుతుంది. ఇంతకాలం వున్న సేల్స్ ట్యాక్స్ లు, ఎంట్రీ ట్యాక్స్ లు, సర్ చార్జీలు వగైరా వగైరా ఏవీ వుండవు. మొత్తం 18 ట్యాక్స్ ల బదులు ఒకే ఒక్క జీఎస్టీ అవతరిస్తుంది! ఇంత వరకూ బాగానే వుంది… కాని, జీఎస్టీ వచ్చాక ఏమవుతుంది? ఇదే ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఠపీమని ఎదురవుతోన్న ప్రశ్న!

 

జీఎస్టీ అంటే ఏంటనేది పెద్ద మిస్టరీగా మారిపోయిన నేపథ్యంలో కనీసం బీజేపి మినిస్టర్లన్నా క్లారిటీ ఇస్తారేమో అంటే అది కుదరటం లేదు! యూపీలోని ఓ మంత్రి జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని విడమరిచి కూడా చెప్పలేకపోయాడట! విలేఖరి ప్రశ్నిస్తే తెల్ల ముఖం వేశాడట! ఆయనే పరిస్థితే అలా వుంటే మామూలు వారి సంగతి చెప్పాలా? అంతా అయోమయమే! రేపు తెల్లవారితే ఏమవుతుందని అందరూ ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. మరీ టెన్షన్ పడని వారు సైతం జూన్ 30 అర్ధ రాత్రి తరువాత జూలై ఒకటి వచ్చేస్తుంటే చోటు చేసుకోబోయే మార్పుల గురించి ఆసక్తిగానే వున్నారు!

 

జీఎస్టీ అంటే … ఇదేదో నోట్ల రద్దు లాంటి షాక్ అనుకోటానికి వీల్లేదు. 1980లలో నుంచీ మన దేశంలో జీఎస్టీ అనే మాట వినబడుతూనే వుంది. 2009 నుంచీ అయితే బలంగా ప్రచారం జరుగుతోంది. అసలు జీఎస్టీని మొదట వార్తల్లోకి తెచ్చింది కాంగ్రెస్సే! కాని, ఇవాళ్ల తాము ప్రచారంలోకి తెచ్చిన జీఎస్టీని తామే విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వారు. అర్థ రాత్రి జరగబోయే జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమానికి కూడా డుమ్మాకొట్టి నిరసన తెలుపుతున్నారు. కారణం చాలా సింపుల్… క్రిడెట్ బీజేపికి, మోదీకి దక్కటం వారికి ఇబ్బందిగా వుంది!

 

కాంగ్రెస్ లాగే తృణమూల్ కాంగ్రెస్ లాంటి చాలా పార్టీలు జీఎస్టీ మిడ్ నైట్ హంగామాలో పాల్గొనబోవటం లేదు. అయితే, జీఎస్టీ వల్ల జనం నిజంగా ఇబ్బంది పడతారా? ఇప్పుడు ఇదీ అసలు ప్రశ్న. బీజేపి తాము చేసింది గొప్ప ఆర్దిక సంస్కరణ అని చెప్పుకోవటం ఊహించిందే. అది సబబు కూడా! దశాబ్దాల తరబడి పక్కన పడి వున్న జీఎస్టీ బిల్లును మోదీ, జైట్లీ పట్టుదలతో పట్టాలెక్కించారు. కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. కాని, ఇప్పుడు అత్యంత ఇబ్బందికర స్థితిలో వున్న హస్తం పార్టీ జీఎస్టీపై ఏదో చేయాలి కాబట్టి విమర్శలు చేస్తోంది. బీజేపి విజయానికి గుడ్డిగా మద్దతిస్తే తమ వాల్యూ తగ్గుతుందేమోనని సోనియా , రాహుల్ భయం.

 

1954లో మొట్ట మొదటిసారి ఫ్రాన్స్ తమ దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 160దేశాలు జీఎస్టీ లాంటి ఏకీకృత పన్ను వ్యవస్థ తమ తమ ఆర్దిక వ్యవస్థల్లో ప్రవేశపెట్టాయి. ఎక్కడా ఊహించలేనంత ఇబ్బందులు, కస్టాలు ఎదురుకాలేదు. కొంత వరకూ గందరగోళం నెలకొన్నా మళ్లీ తమంతట తామే వ్యవస్థలు సర్దుకున్నాయి. కాబట్టి ఎంతో బలంగా వుండే భారత ఆర్దిక వ్యవస్థ జీఎస్టీ వల్ల అమాంతం కుప్పకూలిపోయే ప్రమాదం ఏం లేదు. ఇక సామాన్యులకి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పటానికి ఎలాంటి ఆధారమూ ఇంత వరకూ లభించలేదు. కొన్ని వస్తువుల ధరలు పెరిగితే మరికొన్ని తగ్గుతాయి కాబట్టి జనాల జీవితాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఎంత మాత్రం లేదు. కొంత కాలం చిన్న చిన్న ఒడిదుడుకులు వుంటే వుండొచ్చు! కాని, అందుకు తగ్గ దీర్ఘ కాలిక ప్రయోజనాలు జీఎస్టీ వల్ల లభిస్తాయని ప్రపంచ దేశాల చరిత్ర చెబుతోంది!