బీఆర్ఎస్ లో గ్రూపుల లొల్లి.. ఎన్నికల ముంగిట భగ్గుమంటున్న విభేదాలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో బీఆర్ఎస్ లో విభేదాల రచ్చ మొదలైంది. దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ  బీఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలతో సతమతమౌతోంది. గ్రూపుల లొల్లి ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలతోపరిస్థితిని చక్కదిద్దేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందన్న విషయంలో పార్టీలోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఈ పరిస్థితి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా సమస్యల వలయంలో చిక్కుకుంది. పార్టీలో గ్రూపు తగాదాలకు తోడు.. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరోపణల్లో చిక్కుకుని సమస్యలను ఎదుర్కొంటుండటం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొటుంటడం, ఏ క్షణంలోనైనా ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం, అలాగే టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ కేసులో కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండటం, పేపర్ల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

మరో వైపు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవలసిన సమయంలో కేసీఆర్ పూర్తి సమయం పార్టీ కార్యకలాపాలకు కేటాయించలేని పరిస్థితిలో ఉండటంతో బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు డేంజర్ స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నాయకుల మధ్య కూడా సఖ్యత లేని పరిస్థితి నెలకొంది.   ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్నవారు ఓ జట్టుగా ఉంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన మారు మరో వర్గంగా మారిపోయారు.  కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఆయా గ్రూపుల సమ్మేళనాలుగా మారిపోయాయి.  

దీనికి తోడు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అని ఒక సారి, తూచ్ అందరికీ కాదు కొందరికే అని మరోసారి.. పనితీరును బట్టే పార్టీ టికెట్లు అంటూ ఇంకో సారి ప్రకటనలు చేయడంతో సిట్టింగులలోనే కాకుండా ఆశావహుల్లో కూడా అసంతృప్తి,  అభద్రత నెలకొన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తరువాత చూసుకుందాం అన్నట్లుగా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను మమ అనిపించేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా పాల్గొనడం లేదు.  ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది.