టీడీపీలో చేరడానికి 500 వాహనాల్లో అమరావతికి!!
posted on Mar 9, 2019 2:06PM
కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులు నేడు అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు గౌరు దంపతులు పార్టీలో చేరడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వారు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గౌరు దంపతులతో పాటుగా పలువురు వైసీపీ కీలక నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా టీడీపీలో చేరనున్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కర్నూలు కార్పొరేషన్, కల్లూరు అర్బన్ వార్డులు, రూరల్, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల నుంచి దాదాపు 500 వాహనాల్లో గౌరు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అమరావతికి బయలుదేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం ప్రజావేదికలో గౌరు దంపతులు టీడీపీలో చేరనున్నాను.
గౌరు దంపతులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి ఎంతో విధేయతగా ఉంటూ వచ్చారు. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కూడా గౌరు కుటుంబం జగన్‌కు అండగా నిలిచింది. ఆయన వెంటే నడిచింది. ఆ దంపతులు వైసీపీలో కీలకంగా ఎదిగారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం గౌరు వెంకటరెడ్డి కృషి చేశారు. 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలిచారు. ఇటీవల వైసీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాణ్యం టికెట్‌పై గౌరు చరితకు స్పష్టత ఇవ్వకపోగా.. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగింది. దీంతో అలకబూనిన గౌరు దంపతులు ఈ నెల 1వ తేదీన వైసీపీకి, పదవులకు రాజీనామా చేశారు.