సెక్షన్: 8పై కేంద్రం నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం?
posted on Jun 26, 2015 8:45AM
.jpg)
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం చర్చించడానికి సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై కేంద్రం నుండి రెండు విభిన్నమయిన సంకేతాలు రావడంతో దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనే సంగతి తెలియకుండా జాగ్రత్త పడినట్లుంది. పరిస్థితులను బట్టి అవసరమయితే సెక్షన్: 8ని అమలుచేయవచ్చని కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సలహా ఇచ్చినట్లు ముందు వార్తలు వచ్చేయి. కానీ కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఇరువురూ కూడా అంతరాష్ట్ర వివాదాలలో కేంద్రం తనంతట తానుగా జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో హోంశాఖ తమను సంప్రదించలేదని, తాము హోంశాఖకు ఎటువంటి సలహాలు, ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ మీడియాకు తెలిపారు. కనుక సెక్షన్: 8 అమలుకు కేంద్రం అనుమతిస్తుందో లేదో అనే సంగతి ఈరోజు తెలిసి అవకాశం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి నమోదు చేసుకొన్న ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై కేంద్రం వైఖరిపై కూడా నేడు స్పష్థత వచ్చే అవకాశం ఉంది.