అశోక్‌గజపతిరాజుకి రాజ్యంగ పదవి!

కేంద్ర మాజీ మంత్రి,  తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. 

పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం రాజవంశస్థులు. అయినా ఆయనలో ఇసుమంతైనా దర్పం కన్పించదు . ప్రజాస్వామ్యంపై ఆయనకు ఎనలేని గౌరవం.  నేటికీ ఆయన పబ్లిక్‌గా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ పదం వినిపిస్తుందంటే  డెమోక్రసీ పై ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . 1978 లో రాజకీయాల్లోకి వచ్చి 2019 వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా , కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

వివాద రహితుడు, హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన మిస్టర్ క్లీన్ కాబట్టే 2024 ఎన్నికల తరువాత టీడీపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ పదవి కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అశోక్‌గజపతి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అ పదవికి ఆయన మాత్రమే సూటబుల్ అని  తెలుగు తమ్ముళ్ళుతో పాటు అధినేత చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది . 

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి , వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు . మరోవైపు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం తొలగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఖాళీలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అటు బీజేపీ, ఇటు టీడీపీ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి  ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇస్తారంటున్నారు.

అలాగే తమిళనాడు గవర్నర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది .  అదే జరిగితే టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉందంటున్నారు. వాటిలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతిరాజు అంటే ప్రధానికి ఎంతో గౌరవం ఉందని, అందుకే ఆయనకు రాజ్యాంగ పదవి దక్కడం ఖాయమంటున్నారు.

చంద్రబాబు ప్రత్యేకంగా అశోక్ గజపతిరాజుకే ఆ పదవి ఇవ్వడానికి కారణాలు లేకపోలేదంటున్నారు . రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా , కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుపై  మచ్చుకైనా ఒక్క అవినీతి మారక లేదు.  ఎక్కడా పార్టీకి సంబంధించి గానీ , ప్రజలను ఉద్దేశించి గానీ ఇప్పటివరకు వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భం లేదు . టీడీపీలో అంత సీనియర్ అయినప్పటికీ ఆయన పార్టీ లైన్ ను ఎక్కడా క్రాస్ చేయలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ స్టాండే తన స్టాండ్ అన్నట్లు కట్టుబడి ఉన్నారు.

 2018లో ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకి వచ్చినపుడు చంద్రబాబు ఆదేశించగానే అశోక్‌గజపతి  రాజు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు . నేటికీ ఏ ఒక్కరినీ ఏకవచనంతో పిలవడం ఆయనకు తెలీదు. తమ కుటుంబ సంస్థ అయిన మాన్సస్ ట్రస్ట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొన్నారు అశోక్ . అంతేగాని జగన్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. నడవలేని పరిస్థితుల్లో కూడా టిక్కెట్లు ఆశించే ఈరోజుల్లో..  2024 ఎన్నికల సమయంలో వయోభారం కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాలకు తాను అన్‌ఫిట్ అనీ,  ఇక ఎన్నికల్లో పోటీచేయనని స్వయంగా ప్రకటించారు. 

ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఎన్నికల్లో ఆయనే విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే వారు . కానీ రాజకీయాల్లో కొత్త రక్తం దావాలన్నది ఆయన అభిమతం.  అదలా ఉంటే ఇప్పటికీ ఏ ఒక్కరోజూ తనకు గానీ , తన వాళ్ళకు గానీ ఫలానా పదవి కావాలని పార్టీ అధినేతను కోరిన దాఖలాలు లేవు . అంతెందుకు తన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు మంత్రి పదవి కావాలని కూడా అడగలేదట. పార్టీ చెప్పిన పని చేయడమే మన పని అనేది ఆయన సిద్దాంతం . ఈ సిద్దాంతాలు ఉండడం వల్లనే టీడీపీ నుండి గవర్నర్ అనగానే ఆయన పేరే వినిపిస్తోంది. చూడాలి మరి ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టి , ఆ రాజ్యాంగబద్ద పదవి ఆయన్ని ఎప్పుడు వరిస్తుందో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu