గంటా శ్రీనివాసరావు.. ఈ సారి పోటీ ఎక్కడ నుంచంటే?

గంటా శ్రీనివాసరావు.. ఆయన రాజకీయ ప్రస్థానం విలక్షణం. ఆయనకు ఇప్పటి వరకూ ఓటమి అన్నదే తెలియదు. అయితే అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఓ సారి గెలిచిన నియోజకవర్గం నుంచి ఆయన మరో సారి నిలబడిన దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికలోనూ నియోజకవర్గం మారుతుంటారు. అది ఆయన అభీష్ఠమా, పార్టీ నిర్ణయమా అన్నది పక్కన పెడితే నియోజకవర్గం మారినా సరే ఆయన విజయం మాత్రం సాధిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. 

ఆయన తొలి సారి  1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  అనకాపల్లి నియోజకవర్గం లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతే కాదు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి ఆయన రెండో సారి పోటీ చేసిన చరిత్ర ఇప్పటి వరకూ లేదు. 1999లో అనకాపల్లి నుంచి విజయం సాధించిన గంటా  2004 ఎన్నికలలో చోడవరం నియోజకవర్గం నుంచి  అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక  2009లో ప్రజారాజ్యంలో చేరిన గంటా ఆ పార్టీ అభ్యర్థిగా   అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.  ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. అప్పుడు ఆయన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.  రాష్ట్ర విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి  తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. 2014లో తెలుగుదేశం  అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.    ఇక 2019లో గంటా శ్రీనివాసరావు మళ్లీ నియోజకవర్గం మారారు. ఈ సారి విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేం అభ్యర్థిగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు జగన్ హవాలో కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయన పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైతేనేం తెలుగుదేశం పరాజయం తరువాత ఇటీవలి కాలం వరకూ గంటా శ్రీనివాసరావు రాజకీయంగా పెద్ద క్రియాశీలంగా లేరు.   అయితే గత కొంత కాలం నుంచీ ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. ఇటీవలే గతంలో ఆయన చేసిన రాజీనామాను స్పీకర్  తమ్మినేని సీతారాం అమోదించడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే అయ్యారు. 

ఇక ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం అభ్యర్థిగా 2024 ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమే. అయితే ఏ నియోజకర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారన్నదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు లేవన్నది సుప్పష్టం. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం పలు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మాడుగుల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, తెలుగుదేశం అధినేత వ్యూహాలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఈ సారి ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అపజయమెరుగని నేతగా ఉన్న గంటాకు చీపురుపల్లి నిజమైన పరీక్షగా పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు ఉన్న పట్టు సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో చీపురుపల్లి నుంచి బొత్స పరాజయం పాలయ్యారు.

ఆ తరువాత వైసీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎఫెక్ట్ బొత్సపై కూడా గట్టిగానే ఉందని పలు సర్వేలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే విజయం ఖాయమనీ,  ఆ బలమైన అభ్యర్థి గంటా శ్రీనివాసరావేననీ చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పోటీలో దిగితే అపజయమే లేదన్న చరిత్ర ఉన్న గంటా అయితేనే బొత్సకు దీటైన అభ్యర్థి అవుతారని కూడా అంటున్నారు. మొత్తం మీద గంటా పోటీ ఈ సారి ఎక్కడ నుంచి అన్న దానిపై తెలుగుదేశంలోనే కాకుండా రాజకీయవర్గాలలో కూడా ఆసక్తిగా మారింది.