గంగా పుష్కర మహోత్సవం!

గంగాస్నానం పరమపవిత్రం. శివుడి జటాజూటం నుంచి భువికి చేరిన గంగమ్మ పరమపావన నది. అందులో స్నానమాచరిస్తే...సర్వపాపాలు పోతాయన్నది నానుడి.  శతాబ్దాలుగా ఇదే విశ్వాసంతో భక్తులు గంగా స్నానం ఆచరిస్తున్నారు. అటువంటి గంగానది పుష్కరాలు శనివారం(ఏప్రిల్ 22) ఆరంభమయ్యాయి.  మే3వ తేదీతో ముగుస్తాయి.  12 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కర పర్వంలో లక్షలాది మంది   భక్తిశ్రద్ధలతో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.  బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు ప్రారంభ మయ్యాయి. సమస్త ప్రాణికోటి  మనుగడకు ఆధారం.  నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం.

తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జల స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. గంగా పుష్కరం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పరమ పవిత్రమైన పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపðడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన విూనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది.

అయితే పుష్కరకాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని భారతీయులు ముఖ్యంగా హిందువుల విశ్వాసం. ఈ కారణంగా గంగా నదిలో అనేక మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పితృ తర్పణాలు వదులుతారు. 

గంగానది ప్రవహించే ప్రతిచోటా ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే, గంగోత్రి, రుషికేశ్‌, హరిద్వార్‌, వారణాసి, ప్రయాగరాజ్‌లో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతాయి. గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భారతీయుల నమ్మకం. అంతేకాదు, గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భారతీయులు. గతించిన తమ ఆత్మీయులకు గంగా జలాల్లో పిండ ప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే, గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్‌ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని నరేంద్ర వెూదీ పాల్గోనున్నారు.