గాలి జనార్ధనరెడ్డికి మళ్ళీ జైలు గాలి సోకినట్లే ఉంది

 

కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడిందన్నట్లు అయ్యింది గాలి జనార్ధనరెడ్డి పరిస్థితి. మూడేళ్ళపాటు జైలులో గడిపి బయటకు వచ్చిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. బళ్ళారి వెళ్లేందుకు తనకు బెయిలు షరతులు సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. ఆయన బళ్ళారి వెళ్ళడం సంగతి ఏమో కానీ మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. సుమారు ఐదు లక్షల టన్నుల ఇనుప ఖనిజానికి తప్పుడు లెక్కలతో తక్కువ చేసి చూపించి కర్ణాటకలోని కెరికెరి పోర్టు నుండి విదేశాలకు ఎగుమతి చేసినందుకు ఆయనపై లోకాయుక్తలో కేసు నడుస్తోంది. ఆయనతో బాటు ఎమ్మెల్యే సురేష్, మరో పది మందిపై కూడా కేసులు నడుస్తున్నాయి. వారందరినీ కొన్ని రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తరువాత వంతు గాలి జనార్ధన్ రెడ్డిదేనని తెలుస్తోంది. కనుక సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మరో పటిషన్ వేసేందుకు ఆయన సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.