కేసీఆర్ గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదు... అశ్వద్ధామ వింత ప్రకటన...

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరుబాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ముగింపు పలికారు. డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా చేస్తోన్న సమ్మెను విరమించారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్... విధులకు హాజరవుతామని ప్రకటించింది. ఒకవైపు హైకోర్టులో ఆశించిన న్యాయం జరగకపోవడం... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు ముగింపు పలికారు. అయితే, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని అశ్వద్ధామరెడ్డి వ్యక్తంచేశారు. ప్రభుత్వం గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదంటోన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మికులెవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు చరిత్రలో లేనివిధంగా 52రోజులపాటు పోరాటంచేసి కార్మికులు నైతిక విజయం సాధించారని అన్నారు. ఇక, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండంగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపట్నుంచి విధులకు రావొద్దని కోరిన అశ్వద్ధామరెడ్డి... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

అయితే, నాలుగైదు రోజులుగా తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నా... అధికారులు మాత్రం తిప్పిపంపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంతో పలు డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించినందున... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి అశ్వద్ధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.