కేసినో అంటే ఏంటి? గ్యాంబ్లింగ్ గురించి తెలుసా? గుడివాడ‌కు ఎలా వ‌చ్చింది?

కెషినో.. గ్యాంబ్లింగ్ హౌస్.. ఇప్పుడు ఏపీలో మాంచి కాక రేపుతున్న వివాదం. తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో కొద్దిరోజులుగా తరచుగా వినిపిస్తున్న మాట. తెలుగు ప్రజలకు ముందెప్పుడూ ప్రత్యక్షంగా తెలియని సంస్కృతి.. ఈ కెషినో గురించే ఇంతగా చర్చల్లోకి రావడానికి ఒకే ఒక్కడు కారణం.. మహామహుల పురిటిగడ్డ గుడివాడ నడిబొడ్డున కెషినో నిర్వహించిన ఘనుడు.. అతనే బూతుల మంత్రి.. డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా ఆయనెవరో ఇప్పటికే గుర్తు వచ్చే ఉంటుంది.. సంక్రాంతి పండుగ సంబరాల నెపంతో గుడివాడలో.. తన సొంత కన్వెన్షన్ సెంటర్ లో కెసినో నిర్వహించిన ఆయనపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. జూదరుల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించిన మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్.

నిజానికి కెసినో సంస్కృతి మన దేశంలోని ఒక్క గోవాలో తప్ప మరెక్కడా లేదు. అందుకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడం అనే కారణం కూడా గోవా విషయంలో ఉండి ఉండొచ్చు. కెసినో సంస్కృతికి పెట్టింది పేరు అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ వెగాస్. ప్రతి ఏటా అక్కడ వచ్చినంత కెసినో ఆదాయం ప్రపంచంలో మరెక్కడా రాదంటే అతిశయోక్తి కాదు. అట్లాంటిక్ సిటీ, షికాగో, న్యూయార్క్ సిటీ, డెట్రాయిట్, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, మిసిసిపీ, సెయింట్ లూయీస్, కన్సాస్ సిటీ తదితర సిటీల్లోనూ కెసినోలు నడుస్తుంటాయి. అమెరికా చరిత్ర తొలి రోజుల్లో కెసినోలు అంటే సెలూన్ లు అని మాత్రమే జనానికి తెలుసు. లాస్ వెగాస్ వచ్చిన పర్యాటకులు ఒకరినొకరు పరిచయాలు పెంచుకోడానికి, కలిసి మద్యం సేవించడానికి, కలిసి గ్యాంబ్లింగ్ ఆడేందుకు కెసినోలకు వెళ్లే సంప్రదాయం ఉండేది.

భారత దేశానికి చుట్టుపక్కల శ్రీలంక, సింగపూర్, మలేషియాల్లో కూడా కెసినోలు నడుస్తుంటాయి. బ్రిటన్ లో కూడా కెసినో సంప్రదాయం ఉంది. ఆయా దేశాలకు మన దేశం నుంచి వెళ్లే కొందరు సరదాగా కెసినోలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కెసినోల్లో రకారకాల గ్యాంబ్లింగ్ లకు సౌకర్యం కల్పిస్తారు నిర్వాహకులు. సాధారణంగా కెసినోలు హొటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ లు, రిటెయిల్ షాపింగ్, క్రూయిజ్ షిప్పులు, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. వాటిలో  గ్యాంబ్లింగ్, డ్యాన్స్ లు, కామెడీ షోలు, ఆటల పోటీలు లాంటివి అందుబాటులో ఉంటాయి. కొన్ని కొన్ని కెసినోల్లో అందమైన అమ్మాయిలు కూడా అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. అందు వల్లే కాలక్రమేణా కెసినోలు వ్యభిచార గృహాలు అనే పేరు కూడా తెచ్చుకున్నాయి. అసలక్కడ ఏమి జరుగుతోందో తెలియకుండా గందరగోళానికి గురిచేసేలా పెద్ద పెద్ద శబ్దాలతో గేమ్ లు నిర్వహించే చోటును ఇప్పుడు కెసినో అంటున్నారు.

కెసినో అనే మాట ఇటలీ నుంచి వచ్చింది. కెసినో అంటే హౌస్ అని అర్థం. 19 వ శతాబ్దం నుంచి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరిగే కొన్నిప్రాంతాల్లో కెసినోలు నిర్వహించేవారు. ఐరోపాలో మొట్టమొదటి సారిగా వెలుగు చూసిన గ్యాంబ్లింగ్ హౌస్ ను కెసినో అని పిలిచేవారు కాదు. 1638 లలో ఇటలీలోని గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ వెనిస్ లో కార్నివాల్ సమయంలో మాత్రమే కెసినోలు నిర్వహించేవారు. స్థానికులను పేదలుగా మార్చేస్తోందనే కారణంతో కెసినో సంప్రదాయాన్ని అక్కడ 1774లో నిలిపివేశారు. 20వ శతాబ్దంలో కెసినోలను అమెరికా బ్యాన్ చేసింది. అయితే.. 1931లో నెవాడా రాష్ట్రంలో కెసినోలకు మళ్లీ అనుమతి ఇచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో 1976లో న్యాయబద్ధమైన కెసినోలు ఏర్పాటయ్యాయి. వాటిలో గ్యాంబ్లింగ్ ను అనుమతించారు. అట్లాంటిక్ సిటీ ఇప్పుడు అమెరికా మొత్తం గ్యాంబ్లింగ్ జరిగే రెండో అతి పెద్ద నగరంగా నిలుస్తోంది.

గ్యాంబ్లింగ్ హౌస్ లేదా కెసినోలోకి న్యాయబద్ధమైన ప్రవేశ అనుమతి కావాలన్నా, గ్యాంబ్లింగ్ ఆడాలన్నా కనీసం 18 నుంచి 20 ఏళ్ల వయస్సు పూర్తయి ఉండాలి. ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక నిబంధన. నిజానికి కెసినోల్లో గేమ్ లు ఆడే వారికి చక్కని బుద్ధి నైపుణ్యం ఉండాలి. కెసినోల్లో సర్వ సాధారణంగా క్రాప్స్, రౌలెట్, బకారెట్, బ్లాక్ జాక్, వీడియో పోకర్ గేమ్ లు ఉంటాయి. ఈ గేమ్ లు ఆడే వారి నుంచి కెసినో హౌస్ ‘రేక్’ పేరుతో కొంత మొత్తం కమీషన్ గా తీసుకుంటుంది. అది కాకుండా గెలిచిన వారికి వచ్చిన సొమ్ము నుంచి ‘పే అవుట్’ పేరుతో కూడా కెసినో నిర్వాహకులు వసూలు చేస్తారు. అన్ని విదేశీ కెసినోల్లో సభ్యత్వ రుసుము ఉంటుంది. ఏడాదికి కొంత మొత్తం సభ్యత్వ ఫీజు చెల్లించిన వారు కెసినోలోకి ప్రవేశించవచ్చు. గ్యాంబ్లింగ్ సహా ఇతర గేమ్ లలో పాల్గొనవచ్చు. వాటితో పాటుగా ఇతర వినోద కార్యక్రమాలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదంటే.. ఎప్పుడైనా ఒకసారి కెసినోకు వెళ్లాలంటే కొంత మొత్తం ప్రవేశ రుసుం కట్టాల్సి ఉంటుంది.

ఇక గుడివాడ కెసినో విషయానికి వస్తే.. ఒక్కొక్కరి నుంచి 5 వేల రూపాయలు ప్రవేశ రుసుముగా నిర్వాహకులు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పేకాట, రౌలెట్, చీర్ గర్ల్స్ డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ఇతరత్రా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీడియాలో విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది.

గుడివాడ కే.కన్వెష్షన్ లో నిర్వహించిన కేసినో కోసం కోట్లాది రూపాయల విలువైన కెసినో సామగ్రిని  రప్పించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆ కోట్లాది రూపాయలను ఎవరు చెల్లించారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో అనుమతి లేని కెసినోను మంత్రి కొడాలికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో ఎలా నిర్వహించగలిగారనేది ప్రశ్న. కే. కన్వెన్షన్ లో కెసినో నిర్వహిస్తున్నట్లు పబ్లిగ్గానే ప్రచారం చేసినా.. సీఎంకు, డీజీపీకి, ఇతర అధికారులకు తెలియదంటే నమ్మాలా? అసలు అనుమతే లేని కెసినో నిర్వహించేందుకు గుడివాడలో ఎలా పర్మిషన్ వచ్చింది? అనేది పలువురి మీమాంస. లేదా అంగబలం, అర్థబలంతో.. అధికార మదంతో తామేదైనా చేయగలనని చాటేందుకు కెసినో నిర్వహించారా అనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.