తెలంగాణలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
posted on Jun 12, 2023 9:54AM
కర్నాటకలో కాంగ్రెస్ విజయం.. ఇప్పుడు అన్ని పార్టీలకూ ఒక దారి చూపింది. ముఖ్యంగా ఆ పార్టీ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత హామీ పథకం ఎన్నికల విజయానికి ఒక రూట్ మ్యాప్ అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడు అదే దారిలో ప్రయాణించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
కర్నాటక కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీయేనని పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలతో అన్ని పార్టీలూ ఆ హామీపై కసరత్తు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ఇవ్వడమే కాదు.. దాని అమలు కూడా ప్రారంభించేసింది. ఇందుకు ఏడాదికి ఆ రాష్ట్రప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని నాలుగు కోట్ల రూపాయలుగా అంచనా కూడా వేసింది. ఇక రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీమహానాడులో కూడా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ ఉంది. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎలాగూ ఆ హామీనే ప్రధానంగా తన ఎన్నికల హామీగా ప్రకటించి తీరుతుంది.
అందులో సందేహం లేదు. ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఆ దిశగానే యోచిస్తోంది. అయితే ఎన్నికల హామీగా ప్రకటించడం కాకుండా.. ఇప్పుడే అంటే అధికారంలో ఉండగానే.. ఎన్నికలకు ముందుగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని యోచించడమే కాదు.. అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించేసిందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత తదితర అంశాలపై కేసీఆర్ ఇప్పటికే అధికారులను నివేదిక కోరారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఉచిత ప్రయాణం పథకాన్ని ముందుగా పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నాయి.ఏది ఏమైనా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణలో రానున్న ఒకటి రెండు నెలలలోనే ప్రారంభయమ్యే అవకాశం ఉందని అంటున్నారు.