తుది విజయం అమరావతి రైతులదే: జస్టిస్ గోపాల గౌడ
posted on Aug 24, 2020 2:15PM
అమరావతి రైతులు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమేనని, అది న్యాయబద్ధంగానే ఉందని స్వయంగా మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అభిప్రాయపడ్డారు. గత 251 రోజులనుండి అమరావతి రైతులు, ప్రజలు చేస్తున్న దీక్షలైనా, ఇతర పోరాటాలైన తప్పనిసరిగా న్యాయ సమీక్షకు నిలబడతాయనే అభిప్రయాన్నీ అయన వెల్లడించంతో యి ప్రాంత రైతులుకు కొంత ఊరట కలిగినమాట వాస్తవం.
అయితే, ఎక్కడా ఆవేశకావేశాలకు మాత్రం తావివ్వవద్దని, భావోద్వేగాలకు గురికావద్దని అయన పోరాటం చేసే రైతులకు, ప్రజలకు సూచించారు. రాజ్యంగ వ్యవస్థపైన, న్యాయ వ్యవస్థపైనా నమ్మకంపెట్టుకోవాలని, న్యాయ నిపుణులు ఎప్పటికీ వారివైపు ఉంటారని, జస్టిస్ గౌడ వారికి భరోసా ఇచ్చారు.
మీరు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటంలో తుది విజయం తప్పక రైతులదేనని, అమరావతి రైతులు ఎలాంటి పరిస్థితులలోనైన విజయం సాధిస్తారని, ధర్మం వారివైపు నిలబడి ఉంటుందని, జస్టిస్ గౌడ అభిప్రాయపడ్డారు. న్యాయం వారివైపు ఉందని, కోర్టుల్లో వారికి న్యాయం తప్పక జరిగి తీరుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ గోపాల గౌడ, సుప్రీం కోర్ట్ లో న్యాయమూర్తి గా పదవీవిరమణ చేశారు. సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా వెళ్లే ముందు ఆయన ఒడిసా హై కోర్ట్ కు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. ప్రధానంగా సామజిక సమస్యలపై స్పందించే జస్టిస్ గౌడ తెలుగు రాష్ట్రాలలోని ఒక ప్రముఖ వార్తా ఛానల్తో మాట్లాడుతూ, నష్టపోయిన వ్యక్తికి పోరాడే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆయన స్పష్టం చేసారు. నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే దీనిని చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగగకపోతే, ఇకమిగిలింది, వారు న్యాయ వ్యవస్థ తలుపు తట్టడమేనని, జస్టిస్ గౌడ అన్నారు. ఒక మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తియే స్వయంగా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో, అమరావతి రైతులలో ఒకరకమైన నమ్మకం ఏర్పడిందని చెప్పక తప్పదు.