జగనన్న కాలనీలో వరి సాగు..
posted on Sep 5, 2021 11:35AM
పేదలందరికి ఇల్లు కట్టి ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 25 లక్షల మందికి ఇండ్ల పట్టాలు పంపిణి చేశామని.. అందులోనే రెండు దశలో ఇండ్లు నిర్మిస్తామని ప్రకటిస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇండ్ల నిర్మాణం మొదలైందని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది.జగనన్న కాలనీలు ప్రకటించిన ప్రాంతాలు వరదతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల చెరువులుగా మారిపోయాయి. పేదలకు ఇచ్చిన స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులు హడావుడి చేస్తుండగా.. విజయనగరం జిల్లాలో గనన్న కాలనీలో ఓ రైతు ఏకంగా వరి సాగు చేపట్టాడు.
పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ పంచాయతీలోని సర్వే నం.388/5 పరిధిలో పేదలకు స్థలాలు ఇచ్చారు. హద్దురాళ్లు కూడా వేశారు. అక్కడే 20 సెంట్లలో గ్రామానికి చెందిన రైతు సీహెచ్ రాజు వరి సాగు చేస్తున్నాడు. తనకున్న 35సెంట్లలో 15సెంట్ల స్థలాన్ని లేఅవుట్ కోసం ఇచ్చానని, అయితే రోడ్డుకు ఆనుకుని ఉన్న తన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని రాజు అంటున్నారు.తన భూమిలో తాను పంట వేశానని చెబుతున్నాడు.
ప్రధాన రహదారి పక్కనే జగనన్న కాలనీ లేఅవుట్‌లో రైతు వరి సాగు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా, పేదల కోసం ఆ భూమిని సేకరించామని, చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తహసీల్దార్ వెంకటరమణ చెప్పారు. ఆ భూమి ఇవ్వలేదని రాజు అంటున్నట్లు తనదృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. జగనన్న కాలనీలో జగనన్న పంట అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.