ఢిల్లీలో ఈటల తుస్సుమన్నారా? గులాబీకి అస్త్రం దొరికినట్టేనా...

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్  కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన చేరిక అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు బాగా హడావుడి చేశారు. ఆయన చేరిక సెన్సెషన్ అవుతుందన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ఈటల రాజేందర్ కూడా అలాగే వ్యవహరించారు. తన చేరిక ఆషామాషీ వ్యవహారం కాదన్నట్లుగా షో చేశారు. తనతో కలిసి వచ్చే నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. 

తెలంగాణ బీజేపీ నేతలతో పాటు ఈటల అనుచరుల హంగామా ఓ రేంజ్ లో ఉంటే.. హస్తినలో సీన్ మాత్రం మరోలా కనిపించింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక కార్యక్రమం ఎవరూ ఊహించినంత సింపుల్ గా జరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం... కనీసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా కూడా జరగలేదు. ఒడిషాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఈటల రాజేందర్. ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో కీలక నేత కూడా కాదు. అలాంటి నేత సమక్షంలో రాజేందర్ బీజేపీలో చేరడమే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, ఆర్టీసీ యూనియన్‌ లీడర్‌ అశ్వత్థామరెడ్డి, గండ్ర నళిని, అందె బాబయ్య తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు

ఢిల్లీలో జరిగిన ఈటల రాజేందర్ చేరిక కార్యక్రమం ఆయన అనుచరులను కూడా నిరాశకు గురి చేసిందని తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ నేతలైతే పండగ చేసుకుంటున్నారు. ఆత్మగౌరవం అంటూ గొప్పగా చెప్పుకునే ఈటల రాజేందర్ కు తొలి రోజే ఢిల్లీలో బీజేపీ అంటే ఏంటో తెలిసొచ్చేలా జరిగిందని అంటున్నారు. జేపీ నడ్డా కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో జాయినింగ్ కార్యక్రమం జరిగిందంటేనే.. ఈటలకు బీజేపీ హైకమాండ్ ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలుస్తుందని అంటున్నారు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో రాజేందర్ తాకట్టు పెట్టారని మరికొందరు చెబుతున్నారు. ఈటల చేరికపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తోంది గులాబీ సోషల్ మీడియా టీమ్. ఇదేనా రాజేందర్ తమరి ఆత్మగౌరమంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళుతున్నప్పుడు కూడా జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరతారని చెప్పారు. నడ్డా అపాయింట్ మెంట్ కూడా ఖరారైందన్నారు. కాని చేరిక కార్యక్రమానికి జేపీ నడ్డా రాకపోవడం బీజేపీ నేతల్లోనూ నిరాశ కల్గిస్తోంది. జేపీ నడ్డా ఢిల్లీలోనే ఉండి కూడా ఈటల రాజేందర్ చేరిక సమయంలో లేకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను బీజేపీ హైకమాండ్ మామూలు లీడర్ గానే చూస్తుందా అన్న అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటారని భావిస్తే.. ఈటల వెళ్లి బీజేపీలో చేరి బలహీనమయ్యారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.