ఫాంహౌజ్ లో అసైన్డ్ భూముల్లేవా! కేసీఆర్ పై ఈటల ఫైర్ 

తెలంగాణ ఉద్యమంలో ముందున్న తనపై సీఎం స్థాయి వ్యక్తి కుట్ర చేయడం దారుణమన్నారు ఈటల రాజేందర్. రైతులను ప్రలోభ పెట్టి తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ఉద్యమ నేత ఇలాంటి పనులు చేస్తే ఆయన గౌరవం పెంచదని, తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఈటల. నయీం వంటి హంతక ముఠా బెదిరింపులకే తాను భయపడలేదన్నారు. అసైన్డ్ భూముల పేరుతో కుట్రలు చేస్తున్నారన్న రాజేందర్.. ముఖ్యమంత్రి ఫాంహౌజ్ లో అసైన్డ్ భూములు లేవా అంటూ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్ కోసం ప్రభుత్వ భూముల గుండా రోడ్లు వేయలేదా అని ప్రశ్నించారు. ఏది పడితే అది చేస్తే చట్టం ఒప్పుకోదన్నారు ఈటల రాజేందర్. ఫాంహౌజ్ లో భూములు కొన్నప్పుడు రేటు ఎంత.. ఇప్పుడు రేటు ఎంత అని నిలదీశారు. 

తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. బాస్ ఏది చెబితే అది నడవదన్నారు. తన భార్య వ్యాపారం చేస్తుంటే తనపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తో 19 ఏండ్లు పని చేశానని.. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేశానని చెప్పారు. 
2008లో కేసీఆర్ ఆదేశిస్తే రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలకు అండగా నిలిచానని వెల్లడించారు ఈటల రాజేందర్. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మను చంపుకునే ప్రశ్నే లేదన్నారు. భూముల కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు మద్దతుతో విజయం సాధిస్తానని చెప్పారు