యూపీలో... దత్తపుత్రుడి దండయాత్రను ప్రియాంక అడ్డుకోగలదా?

 

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఈ సంగతి చెప్పటం కష్టమే. ఎందుకంటే, బీజేపి మొదలు బీఎస్పీ దాకా అందరికీ గెలుపు పై ఆశలున్నాయి. అదే సమయంలో అనుమానాలు కూడా వున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా నమ్మకం మాత్రం కుదరటం లేదు. అయిదేళ్ల సమాజ్ వాది అరాచక పాలన, పదేళ్ల కాంగ్రెస్ మార్కు యూపీఏ అవినీతి పాలన జనం మరిచిపోయే స్థితిలో లేరు! ఇక బీఎస్పీ కూడా మాయవతి తనకు తాను పెట్టుకున్న విగ్రహాల వల్ల జనాగ్రహానికి గురవుతూనే వుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవాకీ, మోదీ మ్యాజిక్ కి చావు దెబ్బ తిన్నది ఎవరైనా వుందంటే కేవలం మాయవతే! ఆమెకు ఇంచుమించూ సున్నా వచ్చేసింది ఎంపీ ఎలక్షన్స్ లో! ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వంత మెజార్టీ అంత సీన్ లేదు అంటున్నారు!

 

ఉత్తర్ ప్రదేశ్ ను ఒకప్పుడు ఏలిన జాతీయ పార్టీ బీజేపి. అయోధ్య రామ మందిర ఉద్యమంతో అక్కడి జనంలో ఎన్నో ఆశలు రేకెత్తించింది. అంతే స్థాయిలో వారిని నిరాశపరిచింది కూడా. మత కలహాలు మిగిలాయి గాని మందిరం కళ్ల ముందు కనిపించలేదు. పోనీ అభివృద్ది చవి చూసింది లేదు. అందుకే, దశాబ్దాల పాటూ బీజీపికి ఓటు వేయకుండా ఊరుకున్నారు యూపీ వాసులు. కాని, వాళ్లు నమ్ముకున్న ములాయం, మాయవతి కూడా ఒరగబెట్టిందేం లేదు. చివరకు, ఎస్పీ, బీఎస్పీల పాలన అంతకు ముందటి కాంగ్రెస్, బీజేపీల నిర్వాకమే బెటర్ అనిపించేలా చేసింది! అందుకే, ఇప్పుడు అభివృద్ధి నినాదం ఎత్తుకున్న మోదీని యూపీ జనం నమ్ముతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వాటిలో నిజం ఏంటో చివరి ఫలితాలు వస్తేనేగాని తెలియదు!

 

బీజేపి, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ ల త్రిముఖ పోటీలో విజయం ఎవరిదో తెలియదుగాని కాంగ్రెస్ మాత్రం తన సర్వశక్తులు ఒడ్డుతోంది నమోని నిరోధించటానికి. లక్నోలో కాషాయ ముఖ్యమంత్రి తిష్టవేస్తే ఢిల్లీలో మోదీకి అస్సలు తిరుగుండదని వారికి తెలుసు. అలాగని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని యూపీలో తెచ్చుకునే సత్తా కూడా తమకు లేదని గాంధీలకు అర్థమైంది. అందుకే, తనని తాను ప్రధాని స్థాయి నేతగా భావించుకునే రాహుల్ కూడా అఖిలేష్ లాంటి ప్రాంతీయ నాయకుడి దగ్గరకు పోయి ఎన్నికల సభల్లో తిరుగుతున్నాడు. తమది గంగ, యమున సంగమం అంటూ డైలాగ్స్ చెబతున్నాడు. కేవలం వంద సీట్లకు ఒప్పుకుని ఎస్పీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. అంతే కాదు, సోనియా అనారోగ్యం వల్ల ప్రియాంక కూడా ప్రచారంలో ప్రసంగాలు సంధిస్తూ అన్నకి అండగా చెలరేగిపోతోంది. నేరుగా మోదీని టార్గెట్ చేస్తూ ఆయన లాంటి దత్త పుత్రుడు మనకు అవసరం లేదని సెటైర్ వేసింది. గుజరాతీ అయిన నమో తనని యూపీ దత్తత తీసుకుందని కామెంట్ చేశాడు. అందుకే, అలాంటి దత్త పుత్రుడు అఖిలేష్, రాహుల్ లాంటి యూపీ కుర్రాళ్ల ముందు దిగదుడుపేనని ప్రియాంక చెప్పుకొచ్చింది!

 

ప్రియాంక గాంధీ కామెంట్ పైకి తెలివిగానే కనిపిస్తోన్నా దేశ ప్రధాని కాబట్టి మోదీ అందరివాడే తప్ప యూపీ వారికి కాని వాడేం కాదు. పైగా నరేంద్ర మోదీ దత్తపుత్రుడ్ని అంటూ బంధుత్వం కలిపితే ప్రియాంక ఆ పదానికి అనవసర ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి మేలు చేసినట్టే కనిపిస్తోంది. ఆ మధ్య రాహుల్ యూపీలోనే మోదీని ఖున్ కీ దలాల్ అన్నాడు. ఇప్పుడు దత్తపుత్రుడు అక్కర్లేదని ప్రియాంక అనటమూ అంతే. వారణాసి లాంటి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గానికి ఎంపీ,దేశ ప్రధాని అయిన మోదీని వద్దనుకుంటే ఉత్తర్ ప్రదేశ్ కి మేలు చేసేది ఎవరు?

 

నరేంద్ర మోదీ ఆడవాళ్లను సోదరీ, తల్లి అనటం కూడా తప్పేనంది ప్రియాంక! ఆమె ఉద్దేశం ఏదైనా ఇది కూడా  బెడిసికొట్టే ప్రతి దాడే! భారతదేశంలో ఎవరైనా మగవారు తమని తల్లి అనో, చెల్లి అనో అంటే ఆడవాళ్లు ఉప్పొంగి పోతారు! అటువంటిది ప్రధాని అలా సంబోధిస్తే అందులో తప్పేం కనిపిస్తుంది? ప్రియాంక... మోదీ అలా సంబోధించటం తప్పు అనటం... జనంలోకి మంచి సంకేతాలు ఏం పంపకపోవచ్చు! మోదీని ఎలాగైనా టార్గెట్ చేయాలనే తొందర్లో ప్రియాంక కూడా సోనియా, రాహుల్ లాగే నోరు జారటం... ముందు ముందు ఆలోచించుకోవాల్సిన విషయం! జాగ్రత్తపడాల్సిన అంశం...