రాత్రి తిండి ఆరోగ్యానికి చేటు

 

పగటి నిద్ర ఆరోగ్యానికి చేటు అని కొందరు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ, రాత్రి పొద్దుపోయాక తినే తిండి తప్పకుండా మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు చెబుతున్న కారణాలు కూడా ఏమంత ఆషామాషీగా కనిపించడం లేదు.

 

- సూర్యోదయ సూర్యాస్తమాలకు అనుగుణంగా మనలో ఒక జీవగడియారం పనిచేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ జీవగడియారాన్ని అనుసరించి పగటివేళ మన శరీరం పనిచేయడానికీ, ఆహారం తీసుకోవడానికీ సిద్ధపడితే, రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.

 

- ఈ జీవగడియారాన్ని అనుసరించి మన జీర్ణవ్యవస్థకు రాత్రివేళల్లో కనీసం 12 గంటల విశ్రాంతి అవసరం. అయితే ఇలా జీర్ణవ్యవస్థ విశ్రాంతిగా ఉండాల్సిన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి రుజువుచేసేందుకు రాత్రివేళల్లో పని చేసే కార్మికులను గమనించినప్పుడు, వారు ఏడాదికి 10-15 కిలోలు అదనపు బరువుని పొందినట్లు తేలింది.

 

- ఇలా వేళాపాళా లేకుండా జీవగడియారాన్ని ఉపేక్షిస్తూ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధం వంటి జీర్ణక్రియ సంబంధ వ్యాధులే కాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నట్లు రుజువైంది.

 

- సాధారణంగా రాత్రివేళల్లో మన రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. కానీ రాత్రిళ్లు మరీ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించక, రక్తపోటు యథావిధిగానే ఉంటున్నట్లు తేలింది. టర్కీలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇందుకోసం దాదాపు 700 మంది ఆహారపు అలవాట్లను, వారి రక్తపోటులోని హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నవారిలో రక్తపోటు తగ్గకపోవడం అనే సమస్య, మూడు రెట్లు ఎక్కువగా ఉందని గమనించారు. ఈ రక్తపోటుతో పాటుగా ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతున్నట్లు వెల్లడయ్యింది. రాత్రివేళల్లో రక్తపోటు తగ్గకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే!

 

- ఏతావాతా నిపుణులంతా చెప్పేదేమిటంటే... నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందరగానే భోజనం ముగించాలి. ఇంకా వీలైతే రాత్రి ఏడుగంటలకల్లా భోజనాన్ని ముగించేస్తే మరీ మంచిది. ఆ భోజనం కూడా భారీగా కాకుండా అధిక కొవ్వు, తీపిపదార్థాలు, వేపుళ్లు అధికంగా లేకుండా సాదాసీదాగా అరిగిపోయే మితాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన ఆహారపు అలవాట్లు నిపుణులు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పగలంతా కష్టపడుతున్నాం కదా అని రాత్రివేళ పొద్దుపోయాక నిదానంగా రకరకాల ఆహారపదార్థాలతో విందుభోజనాన్ని లాగించేస్తున్నాం. ఇక వారానికి ఓసారన్నా బయటకి వెళ్లి విందు చేసుకునే అలవాటూ పెరిగిపోతోంది. అలాంటి అలవాట్లను ఇప్పటికైనా మార్చుకోమన్నదే నిపుణుల ఘోష!                     

 

- నిర్జర.